Sunday, 23 February 2020

పద్మనాయక వీరుడు గజరావు తిప్పన.


పద్మనాయక చరిత్రకారులు అందరూ 14 -15  శతాబ్దాలలో రాచకొండ దేవరకొండ సామ్రాజ్యాల గురించి మాత్రమేచెప్పారు. అవి కాక ఇంకా పద్మనాయక రాజ్యాలు ఏమైనా ఉన్నాయా అని నాకు సందేహం వచ్చింది.
పద్మనాయక రాజ్యాలకు రెడ్డి రాజ్యాలకు బద్ధ వైరం. వైరం అవి రెండూ అంతం అయ్యేవరకు కొనసాగింది. అందుచేత రెడ్డి రాజ్యాలు గురించి తెలుసుకుంటే పద్మనాయక చరిత్ర గురించి ఏదైనా కొత్తగా తెలుస్తుందేమో అనిపించింది నాకు.

ఉద్దేశం తో నేను రెడ్డి రాజ్యాలు గురించి చదివాను. పద్మనాయకుల లాగే రెడ్లు కూడా యుద్ధ వీరులు. వారు ముందు వ్యవసాయం చేసుకునే వారే అయినా పరాక్రంలో వారు పద్మనాయకులకు ఏమి తీసిపోరు. దానికి తోడు వారు విజయనగర చక్రవర్తి హరిహరరాయల కుటుంబంతో వివాహ సంబంధాలు కూడా నెలకొల్పుకున్నారు.  
అసలు రెడ్లు ఎక్కడివారు? కొండవీడు, రాజమహేంద్రవరం ఏలిన రెడ్డి రాజులు పాకనాడు(ఇప్పటి కడప, నెల్లూరు మరియు దక్షిణ ప్రకాశం జిల్లాలు) నుండి వచ్చిన వారే.  

పద్మనాయకులకు రెడ్లకు వైరం రావటానికి కారణం రేచెర్ల సింగమనాయకుడు జల్లిపల్లి ముట్టడిలో సోమవంశ క్షత్రియులచే కుతంత్రంతో చంపబడటం. కుట్రలో రెడ్లు కూడా సోమవంశ క్షత్రియులకు సాయం చేసారు. దానితో రెండు రాజ్యాల  మధ్య వైరం మొదలయ్యి రెడ్డి రాజ్యాలు రెండూ క్రిస్తు శకం 1448 లో అంతరించేవరకు కొనసాగింది. అందులో కొండవీడు రెడ్డి రాజ్యం క్రిస్తు శకం 1424  లో అంతం అవగా, రాజమహేంద్రవరం రెడ్డి రాజ్యం 1448  లో అంతరించింది. అప్పటికి పద్మనాయకులు రాచకొండ రాజ్యాన్ని కోల్పోయి కేవలం దేవరకొండ రాజ్యాన్ని కలిగి ఉన్నారు. అది కూడా ఒరిస్సా కపిలేశ్వర గజపతి కి సామంత రాజ్యం అయిపోయింది. దేవరకొండ రాజ్యం కూడా చివరకు క్రిస్తు శకం 1475  లో అంతరించింది.

రెడ్డి రాజ్యాల గురించి చదివినపుడు నాకు తెలిసిన కొత్త విషయం ఏమిటంటే కుమారగిరి రెడ్డి సామంతరాజు లో ఒకడు పద్మనాయకుడు అయిన వెలుగోటి రాయపనాయకుడు. మరి ఈయన వెలుగోటి వంశస్థులైన వేంకటగిరి వారికి బంధువు ఏమో మనకు తెలియదు. ఈయన గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు ప్రాంతంలో పరిపాలించాడు. ఈయన సామంతుడే గజరావు తిప్పన. 

క్రిస్తు శకం 1396  లో బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కొండవీడు రాజ్యాన్ని ముట్టడించగా కొండవీడు తరఫున గజరావు తిప్పన ఆయనను ఖమ్మంమెట్ దగ్గర ఓడించాడు.

రెడ్డి రాజ్యంలో అంతర కలహం అయ్యి సింహాసనం కోసం కుమారగిరి రెడ్డి మరియు పెదకోమటివేమా రెడ్డి దెబ్బలాడారు. అందులో రాయపనాయకుడు పెదకోమటివేమా రెడ్డి పక్షం వహించాడు. అంతర్యుద్ధం లో పెదకోమటివేమా  రెడ్డి విజయం సాధించి రాజు అయ్యాడు.  

రాజమహేంద్రవరం రెడ్డి రాజు అయిన కాటయవేమా రెడ్డి కుమారగిరి ని సమర్ధించాడు. పెదకోమటివేమా రెడ్డి రాజరికాన్ని అయన అంగీకరించలేదు. తన సైన్యంతో అయన కొండవీడు ను ముట్టడించారు. అప్పుడు పెదకోమటివేమా రెడ్డి  పక్షం నుండి మరల గజరావు తిప్పన కాటయవేమారెడ్డి ని గుండుగొలను, కోసూరు యుద్ధాలలో ఓడించాడు.

కాటయవేముని కి విజయనగర హరిహర రాయలకు బంధుత్వం ఉంది. అందుచేత హరిహరరాయలు కాటయవేమునికి సాయంగా కొండవీడు ను ముట్టడించడానికి ఛౌన్ద ( Chounda)  సేనాని ని పంపాడు. అప్పుడు గజరావు తిప్పన ఛౌన్ద సేనాని ని కూడా ఓడించాడు.     

అన్ని యుద్ధాలలో గజరావు తిప్పన విజయం సాధించాడు అంటే అయన మహావీరుడు  అయ్యి ఉండాలి. దానికి తోడు పద్మనాయక రాజ్యాలకు రెడ్డి రాజ్యాలకు బద్ధ వైరం. అంటే కొన్ని యుద్ధాల్లో అయినా గజరావు తిప్పన పద్మనాయక రాజ్యాలకు విరుద్ధంగా పోరాడి ఉండాలి. వివరాలు మనకు తెలియవు.

నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే గజరావు తిప్పన అంతటి వీరుడు అయినా సరే పద్మనాయక  చరిత్రలు రాసిన ఒక్క చరిత్రకారుడు కూడా ఆయన పేరు స్మరించకపోవడం.


No comments:

Post a Comment

THE CRUSADES.

  Religious wars are nothing new for the world. One such episode in World history is the Crusades fought between the Christians in Muslims i...