Wednesday, 7 October 2020

అల్లూరి సీతారామరాజు

 సీతారామరాజు పోరాటం గురించి చదివేటపుడు మనం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. సీతారామరాజు చేసినది ఎదురు బోదురు యుద్ధం కాదు, ఒక గెరిల్లా తిరుగుబాటు మాత్రమే. ఆయనకు, అక్కడి ప్రజలకు కొండ ప్రాంతం కొట్టిన పిండి అవటం వలన, ఆయన పౌరుషం వలన, పట్టుదల వలన, వ్యూహం వలన,   సరి అయిన ఆయుధాలు లేకపోయినా సరే ఆయన బ్రిటిష్ వారి మీద అంత ప్రభావం చూపించిన తిరుగుబాటు చేయగలిగాడు. పెద్ద మహారాజులను  సైతం ఓడించి కాలంలో సర్వ భారతదేశాన్ని  శాసిస్తున్న బ్రిటిష్ వారిని సైతం ఇరుకున పెట్టాడు

సర్వ ఆయుధాలు, సంఖ్య కలిగి జపాన్ వారి దమ్ము ఉన్నా కూడా తన ఇండియన్ నేషనల్ ఆర్మీ తో  సుభాష్ చంద్ర బోస్ బ్రిటిష్ వారి మీద తగినంత ప్రభావం చూపలేకపోయాడు.

సీతారామరాజు ఏనాడూ ప్రాణాల మీద ఆశ చూపించలేదు. తిరుగుబాటును విజయవంతంగా నడిపించి, చివరికి 26  సంవత్సరాల పిన్న వయసులోనే తన ప్రాణాన్ని తృణప్రాయంగా త్యజించాడు ఆయన. అంత శక్తివంతులు, ఆధునిక ఆయుధాలు కలిగిన   బ్రిటీష్ వారిని కేవలం కొన్ని వందలమంది గిరిజన సైన్యంతో, విల్లు బాణాలతో ఎదిరించడం సీతారామరాజు ధైర్యాన్ని, పౌరుషాన్ని, నిబద్ధతను, తన మీద తనకు ఉన్న నమ్మకాన్ని, బ్రిటిష్  వారి మీద ఆయనకు ఉన్న కోపాన్ని చూపిస్తాయి. చివరకు ఆయన కేవలం 26  సంవత్సరాల ప్రాయం లోనే తిరుగుబాటులో అసువులు బాసాడు. బ్రిటీష్ వారి పై ఆయన తిరుగుబాటు తెలుగు వారు అందరికీ గర్వ కారణం. 

అల్లూరి సీతారామరాజు 1897  సంవత్సరంలో విశాఖపట్నం జిల్లాలోని "పండ్రంగి" గ్రామంలో జన్మించాడు. అయన తండ్రి వెంకటనారాయణ రాజు స్వస్థలం భీమవరం దగ్గర ఉన్న "మోగల్లు" గ్రామం. తండ్రి రాజమండ్రి లో ఉన్న ముఖ్య కారాగారంలో ఫోటోగ్రాఫర్ గా పని చేసేవాడు. అయన తల్లి సూర్యనారాయణమ్మ పుట్టిల్లు విశాఖపట్నం. 

సీతారామరాజు ఎక్కువగా మోగల్లు లోనే జీవించాడు. అయన రాజమండ్రి లో ఉన్న "ఉల్లితోట బంగారయ్య" స్కూల్ లో, మరియు కాకినాడ , తుని, రామచంద్రపురం లో కూడా కొంత కాలం చదువుకున్నాడు. అయన కాకినాడ లో చదివేటప్పుడు ఆయనకు ఒక స్వతంత్ర యోధుడు ఐన మద్దూరి అన్నపూర్ణయ్య గారితో, మరియు రాళ్ళపల్లి అచ్యుతరామయ్య అనే పండితునితో పరిచయం ఏర్పడింది. అన్నపూర్ణయ్య గారు విప్లవ భావాలు కలిగిన మనిషి. ఇద్దరు కూడా అయన భావాలను ప్రభావితం చేసారు.  

సీతారామరాజు స్కూల్ చదువులో ఉండగా అతని తండ్రి మరణించాడు. అప్పుడు అయన చిన్నాన్న ఐన రామకృష్ణరాజు, సీతారామరాజు ను  తన దగ్గర ఉంచుకుని చదువు చెప్పించాడు. రామకృష్ణరాజు అప్పుడు నర్సాపూర్ లో తెహసిల్దార్ గా పని చేసేవాడు. సీతారామరాజు నర్సాపూర్ లో ఉన్న టేలర్ హై స్కూల్ లో చదివి తరువాత అయన తమ్మునితోను చెల్లెలితోను కలసి తుని పట్టణానికి మారాడు. అక్కడినుండి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాలో పర్యటించి అక్కడి గిరిజనుల బాధలు తెలుసుకున్నాడు.   

ఆయనకు 15  సంవత్సరాల వయసులో సీతారామరాజు తన తల్లి స్వస్థలం ఐన విశాఖపట్నం లో AVN  కాలేజీ లో చేరాడు. తరువాత 4th  ఫారం అంటే 9th  క్లాస్ ఉత్తీర్ణుడు కాకపోవటం వలన ఆయన కాలేజీ మానేసాడు. ఆయన విద్య పట్ల మక్కువ చూపించకపోయినా అప్పుడు భారత దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకున్నాడు.  

అయన తండ్రి మరణం జరిగిన కొంత కాలానికి అయన విద్య ఆగిపోయింది. అప్పుడు ఆయనకు ఇంకా యుక్త వయసు రాలేదు, అయినా సరే  అయన భారత దేశం పడమర భాగానికి, ఉత్తర, వాయువ్య, ఈశాన్య మూలలకు  తీర్థ యాత్రలు చేసాడు. బ్రిటిష్ సామ్రాజ్యం లో భారతదెశ సామజిక, ఆర్ధిక సమస్యలు ఆకళింపు చేసుకున్నాడు. అప్పటి గిరిజనుల స్థితి ఆయనను కదిలించింది. తన పర్యటనలో అయన చిట్టగాంగ్ వెళ్లి అక్కడ తిరుగుబాటుదారులను కలిసాడు.  

సీతారామరాజు మనసులో బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలి అని బీజం పడింది. అయన గోదావరి మరియు విశాఖ జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో మన్యం (అడవి ప్రాంతం) లో నివాసం ఏర్పాటు చేసుకుని  అక్కడ ఉన్న గిరిజనుల సేవ చేద్దాము అని నిర్ణయించుకున్నాడు. అప్పటికి అక్కడి గిరిజనుల అతి దీనమైన పరిస్థితి లో  ఉండి పోలీస్, అటవీ సిబ్బంది మరియు రెవిన్యూ శాఖ వారితో పీడింపబడుతున్నారు. ఆయన వారి మధ్యలో పని చేస్తూ వారికి వారి హక్కులు గురించి చెబుతూ వైద్య సాయం చేస్తూ వారికి సేవ చేసాడు. ఆయన ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకమైన తన పోరాటానికి కేంద్రం గా ఎన్నుకున్నాడు. 

తరువాత ఆయన గిరిజనులను పోలీస్, రెవిన్యూ మరియు అటవీ అధికారుల పీడన కు  వ్యతిరేకంగా వ్యవస్థీకరించి మన్యం ప్రాంతాన్ని అంతటిని పర్యటించాడు. ఆయన గిరిజనులకు అడవి అంతా మీదే అని చెప్పి మద్రాస్ ఫారెస్ట్ ఆక్ట్ 1882  కు వ్యతిరేకంగా పోరాటానికి వారిని సిద్ధం చేసాడు. సీతారామరాజు ఉద్యమానికి మొదటిలో కలిగిన సఫలత వలన అక్కడ ఉన్న గిరిజన  గ్రామాలు  ఒకటి తరువాత ఒకటి గా సీతారామరాజు ను అనుసరించాయి. 

సీతారామరాజు తన పద్ధతిని ఎంతగా నమ్మాడు అంటే, ఒక వార్తాపత్రిక రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కేవలం 2  సంవత్సరాల కాలంలో భారత దేశాన్ని బ్రిటిష్ వారి నుండి విముక్తి చేయగలను అని చెప్పాడు. 

ఆయన గిరిజనులను బ్రిటిష్ వారితో పోరాడేందుకు సంయుక్తం చేస్తుండగా తాను ఉంటున్న ప్రాంతాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలను సవివరంగా పర్యటించి పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. బ్రిటిష్ వారితో పోరాటం మొదలుపెట్టాక సీతారామరాజు ఒకచోట కనిపించి మాయం అయ్యి మళ్ళీ ఇంకోచోట అగుపించి బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టాడు. 

పోలీస్ చౌకీ మీద ఆయన ముట్టడులు ఆయన సాహస కృత్యాలు మన్యం ప్రాంతపు సంప్రదాయం గా అయిపోయాయి. ఆయన అక్కడ మంచి అనుచరులను తయారుచేసుకుని, గిరిజనులతో ఒక ధృడమైన సైన్యాన్ని తయారు చేసాడు. ఆయన సైన్యం దగ్గర కేవలం విల్లంబులు, బల్లాలు మాత్రమే ఉన్నపటికీ అది బ్రిటిష్ సైన్యానికి విరుద్ధంగా అనేక విజయాలు సాధించింది.   

సీతారామరాజు , ఆదివాసుల  దగ్గర  నుండి  వారి  పూర్వ  యుద్ధ  పద్ధతులను  ఆకళింపు  చేసుకొని, వాటికి  తన సొంత యుద్ధ పద్ధతులను జోడించి బ్రిటిష్ వారితో యుద్ధం చేసాడు. ఆయన సైన్యం ఊళల తో, డప్పు వాయిద్యాలతో  సమాచారాన్ని వివిధ ప్రాంతాలకు చేరవేసేవారు. తొందరలోనే ఆయనకు పాత కాలపు ఆయుధాలతో బ్రిటిష్ వారిని గెలవటం కష్టం అని అర్ధం అయ్యింది. అందుచేత ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్ మీద తన దళాల చేత మెరుపు దాడులు చేయించాడు.  

ఆగష్టు 1922  సంవత్సరంలో సీతారామరాజు 3  రోజులలో 3  పోలీస్ స్టేషన్ మీద దాడి చేసాడు. ఆగష్టు 22  చింతపల్లి పోలీస్ స్టేషన్, 23  కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, 24  రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ మీద దాడి చేయబడ్డాయి. దాడుల లో పోలీస్ స్టేషన్ నుండి కత్తులు, తుపాకులు లూటీ చేయబడ్డాయి. దాడులలో ఇదివరకు పోలీస్ వారిచే బంధించబడిన వారి సైన్యానికి చెందిన వీరయ్య దొర కూడా విడిపించబడ్డాడు.

తరువాత సీతారామరాజు రంపచోడవరం, దమ్మనపల్లి, అడ్డతీగల, నర్సీపట్నం మరియు అన్నవరం పోలీస్ స్టేషన్ మీద దాడి చేసాడు.

దోపిడీలు అన్నిటిలోను సీతారామరాజు చేత సంతకం చేయబడిన ఒక లేఖ పోలీస్ స్టేషన్ లో వదలబడింది. లేఖలో పోలీస్ స్టేషన్ నుండి దోపిడీ చేయబడ్డ వస్తువులు ఉటంకించబడ్డాయి. ఆయన  ముట్టడి ప్రాశస్త్యం ఏమిటంటే, ముట్టడికి ముందే తేదీ సమయానికి ముట్టడి చేయబడుతుందో  బ్రిటీష్ వారికి తెలియచేయబడేది.  

ఆయనను ఎదుర్కొనడానికి రాజముండ్రి, విశాఖపట్నం, పార్వతీపురం మరియు కోరాపుట్ నుండి బ్రిటిష్ వారి నాయకత్వంలో రిజర్వు దళాలు మన్యానికి పంపబడ్డాయి. సెప్టెంబర్ 24  తేదీ 1922  సంవత్సరం లో Scot  మరియు Heiter అనబడే బ్రిటిష్ అధికారులు సీతారామరాజు సైన్యంతో పోరాటంలో వధించబడ్డారు, అనేక ఇతర బ్రిటిష్ అధికారులు కూడా గాయపడ్డారు.   

దానితో బ్రిటిష్ వారు అప్రమత్తం అయ్యి అనేక పోలీస్ మరియు ఆర్మీ ప్లాటూన్ ను సీతారామరాజు ను బంధించడానికి పంపారు. యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోయి అనేక సైనికులు మరణించగా యుద్ధంనుండి తిరోగమించారు. అప్పటినుండి సీతారామరాజు సైన్యానికి బ్రిటిష్ సైన్యానికి మధ్య నిరంతరం యుధాలు జరిగాయి. యుద్ధాలలో సీతారామరాజు బ్రిటిష్ వారిని ఓడించ గలిగాడు. అసలు కేవలం విల్లంబులు ఈటెలతో బ్రిటిష్ వారిని ఓడించాడు అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. గెరిల్లా పధ్ధతి అయితే నేమి అది సాధ్యం అయిన పని కాదు. కానీ ఆయన యుద్ధ తంత్రం వలన అది సాధ్యం ఐయ్యింది.

డిసెంబర్ నెల 1922  సంవత్సరం లో బ్రిటిష్ వారు Saunders  నాయకత్వంలో ఒక కంపెనీ (అంటే దాదాపు 200  మంది సైనికులు) అస్సాం Rifles  దళాన్ని Pegadapalle  దగ్గర సీతారామరాజు కోసం ఉంచారు. అప్పటికే సీతారామరాజు దాపరికంలోకి వెళ్ళిపోయాడు. అయన 4  మాసాల తరువాత మళ్ళీ బయటకు వచ్చి గాం మల్లు దొర మరియు గంటం దొర నాయకత్వంలో ఉన్న గిరిజన సైన్యంతో బ్రిటిష్ వారితో యుద్ధం చేసాడు. వారి వద్ద ఉన్న ఆయుధాలు విల్లంబులు ఈటెలు మాత్రమే.      

ఏజెన్సీ కమీషనర్ అయిన Higgins  సీతారామరాజు ను పట్టుకున్న వారికి 10 ,000  రూపాయలు బహుమతిగా  ప్రకటించాడు. అలాగే గంటం దొర, మల్లు దొరల ఒక్కక్కరి మీద 1000  రూపాయలు బహుమతిగా ప్రకటించాడు. బ్రిటిష్ వారు మలబార్ పోలీస్ నుండి సైన్యంలోని అస్సాం Rifles  నుండి వందలమంది sepoy  ను తిరుగుబాటును  అణచడానికి పంపారు. సాండర్స్ మరియు ఫోర్బ్స్ లాంటి బ్రిటిష్ ఆఫీసర్లను సీతారామరాజు అనేక పర్యాయాలు వెనక్కు తిరిగేలా చేసాడు సీతారామరాజు. తాను ఎక్కడ ముట్టడిస్తాడో వారికి ముందే తెలిసేలా చేసి, తనను ఆపమని ఛాలెంజ్ చేసేవాడు సీతారామరాజు. 

తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ప్రాంత కలెక్టర్ ఆయన Rutherford ను తిరుగుబాటును అణచడానికి పంపింది. Rutherford  గ్రామాలలో ఉన్న ప్రజలను  చిత్రహింసలు పెట్టి సీతారామరాజు, అయన ముఖ్య అనుచరులు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాడు. 

సీతారామరాజు అన్నవరం పోలీస్ స్టేషన్ పైన సెప్టెంబర్ 1923  లో దాడి చేసినపుడు రూథర్ఫోర్డ్ బలగాలు గాం మల్లు దొరను బంధించాయి. అలాగే అగ్గిరాజు అనబడే పేరిచర్ల సూర్యనారాణరాజు ను కూడా బంధించాయి,. 

బ్రిటిష్ వారి అణచివేత డిసెంబర్ 1922  సంవత్సరంలో మొదలు అయ్యి, దాదాపు ఒక సంవత్సరం పాటు సాగింది. చివరకు బ్రిటిష్ వారు సీతారామరాజు ను చింతపల్లి మన్యం లో మంప గ్రామంలో బంధించి, ఒక చెట్టుకు కట్టి తుపాకీ తో కాల్చి చంపారు. సీతారామరాజు సమాధి కృష్ణదేవిపేట లో ఉంది. సీతారామరాజు ను బంధించడంలో తోడ్పడ్డ జ్ఞానేశ్వర్రావు అనే పోలీస్ అధికారికి బ్రిటీష్ వారిచే రావు  బహదూర్ అనే బిరుదం ఇయ్యబడింది. 

సీతారామరాజు మరణం తరువాత గిరిజన తిరుగుబాటు చప్పబడి చివరకు అక్టోబర్ 1923  లో అంతం అయ్యింది. మంచి నాయకుడు ఉంటే ఎలాంటి విజయాలు సాధించవచ్చునో, దానికి మన్యం లోని గిరిజన పోరాటం ఒక ఉదాహరణ. 

 

No comments:

Post a Comment

HYDERABAD STATE & MIR OSMAN ALI KHAN THE LAST NIZAM.

  Hyderabad state was the largest independent state in India when we attained independence. The Nizam’s territory consisted of all the distr...