అతను
3 ప్రసిద్ధ బ్రిటిష్ అనుభూతి వాదులలో చివరివాడు. మొదటి ఇద్దరు జాన్
లాక్ మరియు జార్జ్ బర్కిలీ.
జాన్ లాక్ ఒక బ్రిటిష్
తత్వవేత్త, జార్జ్ బర్కిలీ ఒక ఐరిష్ వేదాంతవేత్త
మరియు తత్వవేత్త, చివరిగా హ్యూమ్ ఒక స్కాటిష్ మేధావి. వారు ముగ్గురు బ్రిటిష్
అనుభూతి వాదానికి
త్రిమూర్తులవంటి వారు.
హ్యూమ్, లాక్ చెప్పిన పూర్వ అంతర్గత (apriori) భావాలను
తిరస్కరించాడు. లాక్ ప్రకారం 3 ఎంటిటీలు
ఉన్నాయి; అవి గ్రహించే మనస్సు,
అవగాహన ద్వారా మనస్సు రూపొందించిన ఆలోచనలు (మానసిక స్థితి) మరియు ఆ ఆలోచనలకు
దారితీసే నిజమైన భౌతిక విషయం.
బర్కిలీ
వచ్చి నిజమైన భౌతిక విషయం అవగాహనలోకి
రానందున దానిని అతను తిరస్కరించి మనసు
మరియు ఆలోచనలను మాత్రమే మిగిల్చాడు.
హ్యూమ్
వచ్చి, మనస్సు కూడా మన అవగాహనలోకి
రానందున మనస్సును కూడా తిరస్కరించి కేవలం
ఆలోచనలను ( మానసిక స్థితి) మాత్రమే వదిలివేసాడు. హ్యూమ్ ప్రకారం మనస్సు లేదు, అలాగే పదార్థం కూడా లేదు,
ఉన్నది కేవలం మానసిక స్థితి
మాత్రమే.
అతని
సమకాలీన తత్వవేత్తలు హ్యూమ్ యొక్క పోస్ట్యులేట్లను
చూసి ఆశ్చర్యపోయారు. గ్రహించే ఏజెంట్ అయిన మనస్సును హ్యూమ్
ఎలా తిరస్కరించగలడు అని వారు ఆలోచించారు?
ఆయన చెప్పిన దానిని వారు అసంబద్ధ తత్వశాస్త్రంగా
భావించి, ఆయనను గొప్ప నాస్తికుడిగా
భావించారు.
బెర్ట్రాండ్
రస్సెల్ తన హిస్టరీ ఆఫ్
ఫిలాసఫీలో హ్యూమ్పై ప్రత్యేక శ్రద్ధ
పెట్టాడు. హ్యూమ్ అనుభవవాదాన్ని దాని ఔన్నత్యానికి తీసుకెళ్లడమే
కాకుండా, ఇంక ముందుకు పోలేనంత
అసాధ్యమైన ఇరుకు సందులో వదిలేసాడు
అని ఆయన భావించాడు.
డేవిడ్
హ్యూమ్ 1711లో ఎడిన్బర్గ్లోని సంపన్న కుటుంబంలో
జన్మించాడు. అతనికి చాలా చిన్న వయస్సులోనే
అతని తండ్రి మరణించాడు మరియు అతని తల్లి
అతనిని చదివించింది. అతను ఎడిన్బర్గ్
విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం మరియు సాహిత్యంలో ప్రధాన
విద్యను అభ్యసించాడు. ప్రసిద్ధ తత్వవేత్త కావడమే అతని జీవిత లక్ష్యం.
1734 లో అతను ఫ్రాన్స్కు వెళ్లి అక్కడ నుండి తన మొదటి పుస్తకం "ట్రీటైజ్ ఆన్ హ్యూమన్ నేచర్" రాశాడు. దురదృష్టవశాత్తు అతని పుస్తకం గురించి ఎవరూ పట్టించుకోలేదు. అతను చివరకు ఎడిన్బర్గ్ అడ్వకేట్స్ లైబ్రరీలో లైబ్రేరియన్గా చేరాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ చరిత్రను రచించాడు, దానికి మంచి ఆదరణ లభించింది.
1738లో అతను
తన మునుపటి రచన "ట్రీటైజ్ ఆన్ హ్యూమన్ నేచర్"ని సంక్షిప్తీకరించి దానిని
"మానవ అవగాహనకు సంబంధించిన విచారణ" అని తిరిగి వ్రాసాడు.
అది అతనికి గొప్ప కీర్తిని సంపాదించిపెట్టింది
మరియు అతని పేరు యూరప్
అంతటా వ్యాపించింది. అతని పుస్తకాలు ఫ్రెంచ్తో సహా ఇతర
భాషల్లోకి అనువదించబడ్డాయి. ఆ తర్వాత అతను
మరిన్ని పుస్తకాలు రాశాడు, అవి అతనికి ఇంకా
కీర్తి మరియు పేరు తెచ్చాయి.
హ్యూమ్
యూరప్లో విస్తృతంగా పర్యటించాడు,
మరియు ఆనాటి యురోపియన్ మేధావులతో
పరిచయం పొందాడు. ఆ తర్వాత హ్యూమ్ బ్రిటీష్
రాయబారి సెక్రటరీగా పారిస్ వెళ్లాడు. ఫ్రెంచ్ ప్రజలు అతని గ్రంధాలను, తత్వాన్ని
ఎంతో మెచ్చుకున్నారు మరియు అతనికి బ్రహ్మ
రధం పట్టారు. ఫ్రెంచ్ రాజు, రాయల్టీ మరియు
మేధావులు అతనిని ప్రశంసించడంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.
రూసో అతనికి ఇష్టమైన వారిలో ఒకరు. హ్యూమ్ అతన్ని
లండన్కు తీసుకువచ్చి అతనికి
ఆశ్రయం ఇచ్చాడు, కాని రూసో అస్థిరమైన
మనస్సుతో ఉండేవాడు. తరువాత హ్యూమ్తో కలహించి ఫ్రాన్స్కు తిరిగి వెళ్ళాడు.
1776లో హ్యూమ్
బ్రిటీష్ ప్రభుత్వంలో
స్కాట్లాండ్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా
చేరాడు, అయితే అతని ఆరోగ్యం
నెమ్మదిగా క్షీణించింది మరియు అతను క్యాన్సర్తో బాధపడ్డాడు మరియు
చివరకు 1776లో మరణించాడు.
ఒక
వ్యక్తిగా హ్యూమ్ ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. అతనికి ఏదైనా ఎదురు దెబ్బ
తగిలినా సరే ఎప్పుడూ బాధపడేవాడు
కాదు. అంతేకాక ఆయన ఎల్లప్పుడూ ఆశాజనకంగా
ఉండేవాడు. అతను హాస్యాస్పదంగా మాట్లాడేవాడు,
క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు కూడా
అతను మరణంపై జోకులు వేసాడు.
తాత్విక
ఆలోచనలు:
అతని
కంటే ముందు అనుభూతివాదానికి తత్వ
వేత్త అయిన లాక్ మనస్సు,
ఆలోచనలు మరియు ఆ ఆలోచనలకు
దారితీసిన భౌతిక వస్తువును విశ్వసించాడు.
అప్పుడు
బర్కిలీ వచ్చి, భౌతిక విషయం ఉనికిలో
ఉందో లేదో తెలుసుకోవడానికి మార్గం
లేదు, ఎందుకంటే అది మన ఇంద్రియాల్లోకి
రాదు అని చెప్పి దానిని
తిరస్కరించాడు. దానిని తిరస్కరించి మనస్సు మరియు ఆలోచనలను మాత్రమే
వదిలివేసాడు. అప్పుడు హ్యూమ్ అడుగు పెట్టాడు. మరి
మనస్సు కూడా మన ఉనికిలో
లేదు, ఎందుకంటే అది కేవలం ఆలోచనల
సమాహారం కాబట్టి ఆలోచనలు
మాత్రమే నిజమైనవి అని చెప్పి అతను
మనస్సును కూడా తిరస్కరించాడు.
హ్యూమ్కి మానవుడు కేవలం ఆలోచనల సమాహారమే తప్ప మరేమీ కాదు.
బర్కిలీ
ఒక కాథలిక్ బిషప్. లాక్ యొక్క అనుభూతివాదం
ఒక వ్యక్తిని నాస్తికుడిగా మారుస్తుందని
అతను భావించాడు. అందువల్ల అతను దేవుని ఆలోచనను
పునరుద్ధరించడానికి మరియు అతనిని కేంద్రానికి
తీసుకురావడానికి తన తత్వశాస్త్రాన్ని వాడుకున్నాడు.
బర్కిలీ
ఆలోచనను మనం ఈ విధంగా సంగ్రహించవచ్చు.
ఏదైనా భౌతిక వస్తువు మనస్సులో
ఒక ఆలోచన ఉన్నంత వరకు
మాత్రమే ఉంటుంది కానీ దానికి ఎటువంటి
స్వతంత్ర ఉనికి ఉండదు. నేను
లేదా మరొకరు కావచ్చు లేదా ఇంకా ఎవరు
కూడా దానిని గురించి ఆలోచించకపోయినా సరే దేముడు దానిని
నిత్యం గా ఆలోచిస్తూ
ఉంటాడు కాబట్టి అది ఉనికి లో
ఉంటుంది.
కాబట్టి
భగవంతుడు లేకుంటే ప్రపంచమూ లేదు, ఎందుకంటే దానిని
నిరంతరం గ్రహించేవారు ఎవరూ లేరు. కాబట్టి
ప్రపంచం ఉనికిలో ఉండాలంటే దేవుడు తప్పనిసరిగా ఉనికిలో ఉండాలని బర్కిలీ నొక్కి చెప్పాడు. చివరకు ఈ సిద్ధాంతం ద్వారా
దేవుని ఉనికిని నిరూపించినందుకు బర్కిలీ సంతోషించాడు. వాస్తవానికి అదే కదా అతని
తత్వశాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యం.
హ్యూమ్
ప్రకారం, ప్రపంచం
ఉనికిని నిరూపించడం కోసం బర్కిలీ దేవుడు
అనే భావనను తీసుకువచ్చాడు మరియు ఎవరూ దానిని
అనుసరించకపోయినా ప్రపంచం దేవుడి ఆలోచనగా కొనసాగుతుందని చెప్పారు. ఆలోచనలు ఇంద్రియ గ్రహణశక్తి ద్వారా మాత్రమే ఏర్పడతాయని చెప్పి, ఆపై మన ఇంద్రియ
గ్రహణశక్తి అవగాహనకు మించిన భగవంతుని భావనను బర్కిలీ తన తత్వానికి అరువుగా తీసుకున్నాడు
అని అని హ్యూమ్ చెప్పాడు. ఈ రెండు భావనలు
స్వీయ-విరుద్ధమైనవి అని అందువలన అవి
నిజం కాలేవు అని ఆయన చెప్పాడు.
ఈ
విధంగా హ్యూమ్ చెప్పడం వలన అనుభూతి వాదానికి
చివరికి కేవలం భావనలు
మాత్రమే మిగిలాయి. హ్యూమ్ యొక్క తత్వశాస్త్రం యొక్క
ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, అతను
"కారణవాదం" తిరస్కరించాడు, అంటే ఒక సంఘటన ఇతర
సంఘటనలకు దారి తీయదు మరియు
ప్రతి భావం స్వతంత్రంగా
ఉంటుంది. కార్య కారణ సంబంధం
అనేది ఏదీ లేదు అని
ఆయన చెప్పాడు. ప్రతి ఆలోచన మరియు
అవగాహన మరొకదాని నుండి స్వతంత్రంగా ఉంటుందని
అతను చెప్పాడు. వాటికి నిజానికి అలాంటి కార్య కారణ సంబంధం ఉన్నా
కూడా దానికి కారణం మన ఆలోచనలోకి
రాదు. అలాంటప్పుడు మన ఆలోచనలోకి రానిది
మనకు ఉండదు కూడా.
కొన్ని కారణాలు కొన్ని కార్యాల నుండి వచ్చినట్టు మనకు కనిపించవచ్చు. కానీ అవి మనకు ఒకదాని తర్వాత ఒకటి మన దగ్గరకు చేరి ప్రభావం కారణం నుండి వచ్చిందని నమ్మేలా చేస్తుంది.
లాక్
మరియు బర్కిలీ తత్వాలలోని లోపాలను ఎత్తి చూపడం ద్వారా
హ్యూమ్ అనుభవవాదాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు. అతను తరువాతి పాశ్చాత్య
తత్వవేత్తలను విపరీతంగా ప్రభావితం చేశాడు; ప్రత్యేకంగా ఇమ్మాన్యుయేల్ కాంట్ ను. హ్యూమ్
యొక్క తత్వశాస్త్రం తనను తాత్విక నిద్ర
నుండి మేల్కొలిపిందని కాంట్ చెప్పాడు.
No comments:
Post a Comment