Sunday, 25 October 2020

పద్మనాయక వెలమల ఆవిర్భావం.

 పద్మనాయకులు నల్గొండ జిల్లాలోని పిల్లలమఱ్ఱి ఆమనగల్లు ప్రదేశాల వారు. వారే కాకుండా రెడ్లు కూడా అదే ప్రదేశానికి చెందినవారు. 

పద్మనాయకులు ఎటుల జన్మించారో తెలపడానికి కొన్ని కథలు ఉన్నాయి. అవి ముఖ్యంగా మూడు. కానీ గాథలు వేటికీ కూడా చారిత్రక ఆధారాలు లేవు. 

కానీ ఇతిహాసం ఉన్నపుడు దానిని చెప్పాలి. అందుకే మూడు కథలు కింద క్లుప్తంగా ఇస్తున్నాను. 

దానిలో మొదటి దాని ప్రకారం పద్మనాయకులు క్షత్రియులు అని, పరశురాముడు క్షత్రియులు అందరిని నిర్జిస్తుండగా వారు తమ జంధ్యాలు తీసివేసి తాము పద్మనాయకులు అని చెప్పుకుని  దక్షిణా పథానికి వచ్చారు అని అంటారు. 

రెండవ దాని ప్రకారం పద్మనాయకులు మహాపద్మ నందుడు కి ఒక శూద్ర స్త్రీతో జన్మించినవారు అని, మహాపద్మ నందుడిని చంద్రగుప్త మౌర్యుడు ఓడించిన తరువాత వీరిని కూడా చంపడానికి  వెంట పడగా వారు దక్షిణా పథానికి వచ్చి పద్మనాయకులు అయ్యారు అని అంటారు.  

మూడవ దాని ప్రకారం పద్మనాయకులు కొండ అవతల (అంటే వింధ్య పర్వతాల అవతల) నివసించేవారని, వారిని వింద్జ్య పర్వతాల అవతల నుండి దక్షిణా పథానికి బహిష్కరించడం వలన అక్కడికి వలస వచ్చి వెలమలు (వెలి అంటే కొండ, మల అంటే అవతల అంటే కొండ అవతల) అయ్యారు అని అంటారు. 

మన దగ్గర చారిత్రక ఆధారాలు లేకుండా విషయం నమ్మడానికి లేదు. అందుచేత మూడు కూడా నమ్మటం సరి కాదు.   

కానీ మూడు ఇతిహాసాలు కూడా వెలమలు ఉత్తర భారత దేశం నుండి వచ్చినవారు అని సూచిస్తున్నాయి. అంటే బహుశా అది నిజం కావడానికి ఆస్కారం ఉంది. కానీ అది కూడా మనం నిశ్చితంగా చెప్పలేము. 

పల్నాటి యుద్ధం ముందు కాలంలో ఉండిన వెలమల గురించి కొన్ని ఊహా గానాలు ఉన్నాయి, కానీ మళ్ళీ మరల వాటికి కూడా ఏమీ చారిత్రక ఆధారాలు లేవు. 

పల్నాటి యుద్ధనికి ముందు ఎక్కడా వెలమల ప్రస్తావన లేదు. కానీ మనకు రెండు చారిత్రక దృష్టాంతారాలు  మట్టుకు దొరుకుతాయి. అవి ఏమిటంటే నలగామరాజు (పల్నాటి యుద్ధం ఫేమ్)  పిలుపున కాకతీయ రాజు ఐన కాకతి రుద్రదేవుడు( 1163 -1195 )  తన సైన్యంతో మళ్ల్యాల, కొమరవెల్లి, విప్పర్ల  మరియు నతవాది నాయకులను తీసుకుని సైన్యంతో  కోట నాయకుడు ఐన దొడ్డ భీముడిని జయించి ధరణికోటను అతడి నుండి స్వాధీనం చేసుకున్నాడు అని ఉంది. మళ్ల్యాల మరియు విప్పర్ల రెండు కూడా పద్మనాయక వెలమ గోత్రాలే. 

అంతే కాకుండా పల్నాటి యుద్ధం ముందు ఉన్న వెలనాటి గొంకరాజు మంత్రి దొడ్డ నాయుడు(బ్రహ్మనాయుడి  తండ్రి)  రేచెర్ల పద్మనాయకుడు. ఆంటే అప్పటికే పద్మనాయకులు స్థిరపడి నాయక లక్షణాలు కలిగి ఉన్నారు. అది కేవలం ఒక తరం లో అయ్యే పని కాదు. దానిని బట్టి అంతకు ముందు కూడా పద్మనాయకులు స్థిరపడి ఉన్నారు ఉన్నారు అని మనకు తెలుస్తుంది. కానీ దానికి ఏమీ చారిత్రక ఆధారాలు మట్టుకు లేవు.    

పల్నాటి యుద్ధం తరువాత గణపతిదేవుని పరిపాలనలో మళ్ళీ మనకు పద్మనాయకులు తగులుతారు. మొదటిగా రేచెర్ల రుద్రుడు, ఆయన గణపతిదేవుని   ముఖ్య సేనాధిపతి. కానీ అయన పద్మనాయకుడా లేక రెడ్డి నా అన్నది స్పష్టంగా తెలియదు కానీ ఎక్కువ మంది చరిత్రకాలు అయన  రెడ్డి అనే నమ్ముతారు.  కానీ వెలుగోటివారి వంశావళి లో ఆయన పద్మనాయకుడు అని చెప్పబడింది.  రెడ్ల లో కూడా రేచెర్ల గోత్రం ఉంది. పైగా దానికి తోడు వారు కూడా పద్మనాయకుల లాగే నల్గొండ లోని పిల్లలమఱ్ఱి, ఆమనగల్లు ప్రదేశం నుండి వచ్చినవారే. 

మనకు కాకతీయ సామ్రాజ్యంలో అందరు చరిత్రకారులు అంగీకరించే పద్మనాయకులు గణపతిదేవుని కాలం లోనే తగులుతారు. అందులో మొట్ట మొదటి వాడు ఎర దాచానాయకుడు, ఆయన తరువాత దామ, రుద్ర, ప్రసాదిత్యనాయకులు. వీరు అందరూ గణపతిదేవుని (1199 -1262 )  సైన్యాధిపతులు.  

కాకతీయ రాజ్య పతనం అనంతరం రాజ్యం అంతా మహమ్మద్ బీన్ తుగ్లక్ అధీనం అయ్యింది. అయన దాన్ని పాలించడానికి ఓరుగంటిలో ఒక సైన్యాధిపతి ని నియమించాడు. ఆంధ్ర దేశం అంతా ముస్లిం పాలన లో అల్ల కల్లోలం అయిపొయింది.  

ముస్లిం సేనలతో యుద్ధంలో అనేక మంది నాయకులు అసువులు బాసారు. ముఖ్య నాయకులలో కేవలం బెండపూడి అన్నయమంత్రి, కొలని ప్రతాపరుద్రుడు మరియు రేచెర్ల సింగమనాయకుడు మిగిలారు.  ప్రతాపరుద్రుని మంత్రి, గజ సాహిణి  ఐన బెండపూడి అన్నయమంత్రి మరియు కొలని రుద్రదేవుడు కలసి అప్పటికి మిగిలిన నాయకులను అందరిని కూడబెట్టి ముస్లిం పాలకుల నుండి ఆంధ్ర దేశాన్ని విడిపించడానికి పూనుకుని, భద్రాచలం దగ్గరగా ఉన్న రేకపల్లిని పాలిస్తున్న ముసునూరి ప్రోలయనాయకుడిని ( కమ్మ నాయకుడు) వారి అందరికి నాయకుని గా నిలిపారు.    రేచెర్ల సింగమనాయకుడు కూడా ఏర్పాటును అంగీకరించాడు. 

కూటమి లో వీరు ముగ్గురు, ముసుసునూరి ప్రోలయనాయకుడు కాకుండా, కొప్పుల ప్రోలయనాయకుడు, అద్దంకి వేమా రెడ్డి, మంచుకొండ గణపతి నాయకుడు ఉన్నారు. 

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పటివరకు ముసునూరి ప్రోలయనాయకుడి పేరు ఎక్కడా నాయకుడిగా కానీ మంత్రిగా, లేక సామంతుడిగా కానరాదు. అంతకు  ముందు ఆయన పేరే ఎక్కడా వినబడలేదు. కానీ ఆయనకు అన్నయ మంత్రి మాత్రమే కాకుండా అనేక దుర్గాలకు అధిపతి, ప్రతాపరుద్రుని బంధువు ఆయన కొలని రుద్రదేవుడు మద్దతు పలకడం వలన ఇతరులకు ఆయన ఆధిపత్యం స్వీకరించవలసి వచ్చింది.  

వారు  అందరూ కలసి ముసునూరి ప్రోలయనాయకుడి ఆధిపత్యంలో ఆంధ్ర దేశాన్ని ముస్లిం పాలన నుండి 5  సంవత్సరాల  కాలంలో విముక్తం చేసారు. అప్పుడు ముసునూరి ప్రోలయనాయకుడు ఆంధ్ర దేశాధీశ్వర అని బిరుదం గైకొని ఓరుగల్లు రాజధాని గా ఆంద్ర దేశాన్ని పాలించసాగాడు. అప్పటికి మొత్తం ఆంధ్ర దేశం ఆయన పాలన లోకి వచ్చింది. 

కానీ ముసునూరి  ప్రోలయనాయకుని నాయకత్వం లో ఏకం ఐన నాయకులు అందరూ ముందుగా ఆయనకు లొంగి ఉండినవారు కాదు. ముస్లిం పాలన తొలగ గానే ముఖ్య నాయకులు అందరూ ఎవరికి వారే వారి రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేసారు. అందులో రేచెర్ల సింగమనాయకుడు ఒకడు. అయన నెమ్మదిగా తన రాజ్యాన్ని విస్తరిస్తూ ప్రోలయనాయకుడిని ఓడించాడు. ఆయన పుత్రులే రాచకొండ, దేవరకొండ ప్రాంతాలను పాలించిన అనపోతా, మాదా నాయకులు. ప్రోలయనాయకుని తరువాత రాజ్యానికి వచ్చిన ఆయన చిన్నాన్న పుత్రుడు ఐన ముసునూరి కాపయనాయకుడిని,  అనపోతా మరియు మాదానాయకులు భీమవరం యుద్ధంలో ఓడించి వధించి ఓరుగల్లు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.   

అప్పటికి తీరాంధ్ర ప్రాంతం, సింహాచలం నుండి నెల్లూరు వరకు అద్దంకి రెడ్డి రాజ్యంలో(తరువాత కొండవీడు రెడ్డి రాజ్యం లో) ఉండగా, తెలంగాణా మొత్తాన్ని అనపోత, మాదా  నాయకులు  పాలించారు. అంటే పాలించిన ప్రదేశాన్ని బట్టి రెడ్డి రాజులు ఎంత ముఖ్యం అయినవారో, పద్మనాయక రాజులు కూడా అంతే ముఖ్యం ఐన వారు. మాటకి వస్తే రేచెర్ల నాయకులు పాలించిన భూభాగం రెడ్డి రాజ్య భూభాగం కంటే ఎక్కువ, ఎందుకంటే రాయలసీమ జిల్లాలు ఐన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం విజయనగర రాజ్యంలో ఉండేవి.

కానీ మనం ఆంధ్ర చరిత్ర మీద పుస్తకాన్ని చూచినా రెడ్లకు ఇచ్చిన ప్రాముఖ్యం పద్మనాయక రాజ్యానికి ఇవ్వరు. మరి అది ఎందుచేతనో నాకు అర్ధం కావటం లేదు.  

No comments:

Post a Comment