Sunday 15 November 2020

పద్మనాయకులు- కాకతీయ సామ్రాజ్యం నుండి భీమవరం యుద్ధం వరకు.

 కాకతీయ సామ్రాజ్యంలో చరిత్రకు తెలిసిన మొదటి పద్మనాయకులు సోదరులు ఐన దామ, ప్రసాదిత్య రుద్ర నాయకులు. మువ్వురు కూడా కాకతీయ చక్రవర్తి ఐన గణపతిదేవుని (1199 -1262 ) సైన్యాధిపతులు. మువ్వురిలోను ప్రసాదిత్యనాయకుడు ముఖ్యుడు. 

గణపతిదేవుని మరణం తరువాత చాల మంది సైన్యాధిపతులు, సామంతులు స్త్రీ కావడం వలన రుద్రమదేవి రాజ్యానికి అధిపతి కావడం ఇష్టపడలేదు. అప్పుడు రేచెర్ల ప్రసాదిత్యనాయుడు, కాయస్థ అంబదేవుడు ఆమె పక్షం వహించి పోరాడి రుద్రమదేవిని సింహాసనం మీద కూర్చొనపెట్టారు. దానికి మెచ్చి ఆమె వారి ఇద్దరికీ కూడా "కాకతీయరాజ్య స్థాపనాచార్య" అనే బిరుదం ఇచ్చింది. వారి ఇద్దరికీ గోన గన్నారెడ్డి సహకరించినా కూడా ఆయన వీరి ఇరువురి కంటే చిన్న సైన్యాధ్యక్షుడు. 

ప్రసాదిత్యనాయకుని తమ్ములు ఐన దామ, రుద్ర నాయకుల గురించి చరిత్రలో ఏమీ లేదు.అలాగే దామనాయకుని పుత్రులు ఐన వెన్నమ, సబ్బి నాయకుల గురించి కూడా చరిత్రలో ఏమీ లేదు. కానీ వెలుగోటివారి వంశావళి లో మాత్రం వెన్నమనాయకుడు ఒక ముస్లిం సైన్యాన్ని ఓడించాడు అని చెప్పబడింది.   

వెన్నమనాయకుని పుత్రుడే ఎర దాచానాయకుడు అనబడే దాచానాయకుడు. ఈయన సమయం నుండే రాచకొండ రాజ్యం మొదలు అయ్యింది. దాచానాయకునికి మువ్వురు పుత్రులు. వారు సింగమ, వెన్నమ మరియు యాచమ నాయకులు.

దాచానాయకుడు, అతని పుత్రుడు సింగమనాయకుడు ప్రతాపరుద్రుని కొలువులో సైన్యాధిపతులు. 1316  సంవత్సరంలో ముప్పిడి నాయకుని నాయకత్వంలో ప్రతాపరుద్రుని సేనలు కంచిలో పాండ్యులను ముట్టడించి గెలిచినప్పుడు దాచానాయకుడు గొప్ప పరాక్రమం చూపించాడు. దానికి మెచ్చి ఆయనకు ప్రతాపరుద్రుడు "పంచపాండ్యదల విభాల" అనే బిరుదం ఇచ్చాడు. దాచానాయకుడు బహుశా 1323  సంవత్సరం లో ప్రతాపరుద్రునికి ముస్లిం సైన్యాలతో జరిగిన యుద్ధం లో అనేక కాకతీయ సేనాపతులతో సహా మరణించాడు. యుద్ధంలో ముఖ్య సేనాపతులు అందరు మరణించగా ముస్లిం సైన్యాలు ప్రతాపరుద్రుని బందీగా పట్టుకున్నాయి. తరువాత వారు ప్రతాపరుద్రుని బందీగా ఢిల్లీ తీసుకుని పోతుండగా ఆయన నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ప్రతాపరుద్రుని సైన్యాధిపతులు, మంత్రులు అందరు ముస్లింల తో యుద్ధంలో మరణించగా చివరకు మువ్వురు మాత్రం మిగిలారు. వారు 1 . గజ సాహిణి బెండపూడి అన్నయ మంత్రి, 2 . కొలని ప్రతాపరుద్రుడు అనబడే రుద్రదేవుడు (ఇందులూరి కుటుంబానికి చెందినవాడు మరియు 72  దుర్గాలకు అధికారి), 3 . రేచెర్ల సింగమనాయకుడు.

కొలని ప్రతాపరుద్రుడు పెద్ద సైన్యాధిపతి, కాకతీయుల 72  దుర్గాలకు ఆయన అధికారి. ఆంధ్ర దేశాన్ని ముస్లిం పాలన నుండి విముక్తం చేయడానికి ఆయన బెండపూడి అన్నయ మంత్రితో కలసి మిగిలి ఉన్న కాకతీయ సైన్యాధిపతులను, సామంత రాజులను ఏకం చేసారు. 

ఆలా ఏకం చేసిన వారిలో ముఖ్యులు 1 . రేచెర్ల సింగమనాయకుడు, 2 . అద్దంకి వేమా రెడ్డి, 3 . ముసునూరి ప్రోలయనాయకుడు (రేకపల్లి రాజధానిగా భద్రాచలం ప్రాంతాన్ని ఏలినవాడు) , 4 . కొప్పుల ప్రోలయనాయకుడు (పిఠాపురం పరిసర ప్రాంతాన్ని ఏలినవాడు) 5 . మంచికొండ గణపతినాయకుడు. (కోరుకొండ పరిసర ప్రాంతాన్ని ఏలినవాడు).  

వీరు అందరూ,సింగమనాయకుడు తప్ప తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజులు. సింగమనాయకుడు నల్గొండ ప్రాంతంలో పాలించినవాడు. బహుశ ముస్లిం సైన్యాలతో యుద్ధ అనంతరం ఆయన ఏలిన ప్రదేశం ముస్లిం సైన్యాల పరం అయ్యింది. అందుచేత ఆయన తరువాత తీరాంధ్ర దేశంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించి పాలించి ఉండవచ్చు.

బెండపూడి అన్నయ, కొలని ప్రతాపరుద్రుడు వయసులో పెద్దవారు కావటం వలన వారు సమాఖ్య లో భాగం కాకుండా దానికి సలహాదారులుగా ఉన్నారు.  సమాఖ్య కు అధిపతిగా ముసునూరి ప్రోలయనాయకుని పేరును కొలని ప్రతాపరుద్రుడు ధృడంగా ప్రతిపాదించగా దానిని బెండపూడి అన్నయ సమర్ధించాడు. దాని కారణం వలన సింగమనాయునికి వేరే దారి లేక దానిని అంగీకరించాల్సి వచ్చింది.

1323  సంవత్సరం లో జరిగిన ఓరుగల్లు  యుద్ధానికి ముందు చరిత్ర ప్రకారం అసలు ముసునూరి ప్రోలయనాయకుని పేరు సైన్యాధిపతి గా కానీ, సామంతుడిగా కానీ మంత్రిగా కానీ ఎక్కడా వినబడలేదు కానీ కొలని ప్రతాపరుద్రుని, మరియు బెండపూడి అన్నయ యొక్క ఆదరణ ఉండటంవలన ఆయన సమాఖ్య కు నాయకుడు అయ్యాడు.  కానీ కొలని ప్రతాపరుద్రుడు, బెండపూడి అన్నయ ఎంతో అనుభవం ఉన్నవారు. అలాంటివారు ముసునూరి ప్రోలయనాయకుని ఏక పక్షంగా సమర్ధించారు అంటే ఆయన ప్రతిభావంతుడు అయ్యి ఉండాలి. 

ముసునూరి ప్రోలయనాయకుడు పోచినాయకుని పుత్రుడు. అయన రాజధాని పైన చెప్పినట్టు గా భద్రాచలం దగ్గరగా ఉన్న మాల్యవంత పర్వత ప్రాంతంలో ఉండేది. మాల్యవంత పర్వతం అంటే బహుశా ఇప్పటి మన తూర్పు కనుమలు. పైన చెప్పిన సమాఖ్య లోని ముఖ్య నాయకుల సహాయంతో ప్రోలయనాయకుడు తీరాంధ్ర దేశాన్ని దాదాపుగా 1325  సంవత్సరానికి విముక్తం చేసాడు. 1325  సంవత్సరం లో ఘియాజుద్దీన్ తుగ్లక్ మరణించగానే ఉలుఘ్ ఖాన్ అనబడే మహమ్మద్ బీన్ తుగ్లక్ ఢిల్లీలో వ్యహారాలు చూసుకునే సమయాన్ని చూసి ముసునూరి ప్రోలయనాయకుడు, ఆయనకు సహాయపడుతున్న మిగిలిన నాయకులు బయలుదేరి కోటలలో ఉండే ముస్లిం సైన్యాలను ఒకటొకటిగా ఓడించి కోటలను  స్వాధీనం చేసుకున్నారు. తరువాత కొలని ప్రతాపరుద్రుడు 1326  సంవత్సరంలో మరణించగానే ముసునూరి ప్రోలయనాయకుడు తీరాంధ్ర దేశాన్ని ఒక స్వతంత్ర రాజుగా పాలించాడు.  కానీ పైన చెప్పిన మిగిలిన నాయకుల మీద ఆయన ఆధిపత్యం నామ మాత్రమే.

ప్రోలయనాయకుడు, అతని కింద మిగిలిన నాయకులు విడిపించిన ప్రదేశాలు గోదావరి, కృష్ణా, గుంటూరు మరియు నెల్లూరు జిల్లాలు. గోదావరి జిల్లాను అనుకొని ఉండే విశాఖపట్నం గంజాం జిల్లాలు కళింగ రాజుల అధీనంలో ఉండేవి. రాయలసీమ ప్రదేశం విజయనగర సామ్రాజ్యంలోనికి వచ్చేంతవరకు ముస్లిం సైన్యాల ఆధీనంలోనే ఉంది. తెలంగాణ ప్రదేశం కూడా 1344  సంవత్సరంలో ముసునూరి కాపానాయకుడు జయించేవరకు ముస్లిం సైన్యాల అధీనం లోనే ఉంది.  

ప్రోలయనాయకుడు 1325  నుండి 1333  సంవత్సరం వరకు అంటే కేవలం 8  సంవత్సరాల కాలం రాజ్యం చేసి మరణించాడు. ఆయన తరువాత ప్రోలయనాయకుని చిన్నాన్న దేవనాయకుని పుత్రుడు ఐన ముసునూరి కాపానాయకుడు రాజ్యానికి వచ్చాడు. కాపానాయకుడు  1344  సంవత్సరంలో తెలంగాణ ప్రదేశాన్ని ముస్లిం పాలన నుండి విముక్తం చేసాడు. ఆయన ఆంధ్రదేశాధీశ్వర  అనే బిరుదాన్ని వహించి తీరాంధ్ర, తెలంగాణ ప్రదేశాలను ఓరుగల్లు నుండి పాలించాడు.

వెలుగోటివారి వంశావళి లో తన రాజ్య విస్తరణలో భాగంగా రేచెర్ల సింగమనాయకుడు ముసునూరి కాపానాయకుడిని ఓడించాడు అని చెప్పబడింది. కానీ అది పూర్తి విజయం కాదు అని 1357  లో కాపానాయకుడు వేయించిన పిల్లలమఱ్ఱి శాసనం చెప్తుంది. శాసనం వేయించే సమయానికి కూడా తెలంగాణ ప్రదేశం కాపానాయకుడి రాజ్యంలోనే ఉంది

రేచెర్ల సింగమనాయకుడు జల్లిపల్లి యుద్ధం ముందే కుతంత్రంతో చంపబడ్డాడు. కుతంత్రం చేయించింది సోమవంశ క్షత్రియులు, రెడ్లు వారికి సాయపడ్డారు. కాపానాయకుడు కూడా కుట్రలో పాలు పంచుకున్నాడు అని భావించి సింగమనాయుకుని పుత్రులు ఐన అనపోతానాయకుడు, మాదానాయకుడు 1368  సంవత్సరంలో ఓరుగల్లును ముట్టడించి భీమవరం యుద్ధంలో గెలిచి కాపానాయకుని సంహరించారు. అప్పుడు మొత్తం తెలంగాణ ప్రాంతం వారి హస్తగతం అయ్యింది.     

 

No comments:

Post a Comment