Friday, 20 November 2020

పద్మనాయక మరియు రెడ్ల యొక్క వైరం --అనపోతా రెడ్డి వరకు

 నేను ఇదివరకు కూడా క్లుప్తంగా రాచకొండ రెడ్డి రాజ్యాల మధ్యన వైరం గురించి రాసాను. ఇప్పుడు దానినే   ఇంకా కొంచెం వివరంగా రాసాను. ఇందులో చాలా భాగం రెడ్ల చరిత్రల నుండి తీసుకున్నదే.

నేను కింద రాసినది కేవలం అనపోతారెడ్డి రాజ్యపాలనలో జరిగింది మాత్రమే. ఈ వైరం మిగిలిన రాజుల సమయంలో కూడా కొనసాగింది. వాటిని గురించి చదివి తరువాతి సమయంలో రాస్తాను. 

పద్మనాయకులకు రెడ్లకు మధ్య విరోధం 1361  సంవత్సరం లో  జరిగిన జల్లిపల్లి యద్ధం నుండి మొదలు అయ్యింది. సమయానికి ఆంధ్ర దేశం మొత్తం రాయలసీమ జిల్లాలు మినహా ఆంధ్రదేశాధీశ్వర బిరుదం వహించిన ముసునూరి కాపానాయకుని కింద పాలింపబడుతుంది.

ఆయన పెదనాన్న పుత్రుడు అయిన ప్రోలయనాయకుడికి, ముస్లిం సైన్యాలను ఆంధ్ర దేశం నుండి బయటకు తరమటానికి సహాయపడిన ముఖ్య నాయకులలో సింగమనాయకుడు కూడా ఒకడు. ఈయన మిగతా ముఖ్య నాయకులలాగే నామమాత్రంగా కాపానాయకుని కింద ఉన్నా తన రాచకొండ రాజ్యాన్ని స్వతంత్రంగానే పాలించాడు.

కాపానాయకుడు బహమనీ రాజ్యంతో వైరమువలన బలహీనపడ్డాడు. ప్రోలయనాయకుని సమయంలోనే రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టిన సింగమనాయకుడు ఇంకా అధికంగా తన రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టాడు. ఆయన తన విస్తరణకు తూర్పు ఆంధ్ర దేశం వేపు కూడా చూసాడు. దానికి అక్కడ  ఉన్న క్షత్రియ రాజులు కలతచెంది సింగమనాయకుని రాజ్య విస్తరణ ను ఆపడానికి సమాలోచన చేసారు.

అప్పటికే సింగమనాయకుని పేరు ఒక గొప్ప వీరునిగా అందరికీ తెలుసు. ఆయనతో యుద్ధంలో తలపడి గెలవడం చాలా కష్టం. అందుచేత వారు కుతంత్రం చేసి మొదటిగా రేచెర్ల సింగమనాయకుని బావమరిది అయిన చింతపట్ల సింగమ ను బంధించి జల్లిపల్లి దుర్గంలో ఉంచారు. దుర్గం పరిపాలిస్తున్న పూసపాటి వారైన సోమవంశ క్షత్రియులు బహుశా చాళుక్యుడు అయిన అరవీటి సోమదేవరాజు బంధువులు కావొచ్చును. అది చూసి చింతపట్ల సింగమ అన్న అయిన వెల్లటూరు రాజు గన్నభూపాలుడు వచ్చి జల్లిపల్లి దుర్గాన్ని ముట్టడించి రేచెర్ల సింగమనాయకునికి జరిగిన విషయాన్ని వర్తమానం పంపించాడు.

జరిగిన విషయం విని ఆగ్రహోదగ్రుడయ్యి సింగమనాయకుడు తాను కూడా వచ్చి జల్లిపల్లి దుర్గాన్ని ముట్టడించాడు. వెంటనే సోమవంశ క్షత్రియులు చింతపట్ల సింగమ గురించి మంతనం చేయటానికి రేచెర్ల సింగమనాయకుని దుర్గంలోనికి ఆహ్వానించారు. మంతనాలు జరుగుతుండగా వారి సామంతుడు, ఒక దుర్గానికి అధిపతి అయిన తంబళ్ళ బొమ్మజియ్యరు చేత రేచెర్ల సింగమనాయకుడు ఏమరుపాటు లో ఉన్న సమయం చూసి  బాకుతో పొడిపించి చంపించారు. కుతంత్రంలో వారికి  వారికి రెడ్లు సాయపడ్డారు.      

కాపానాయకుడు కూడా రేచెర్ల సింగమనాయకుని రాజ్య విస్తరణ ను నిరసించాడు ఎందుకంటే అది తన రాజధాని ఓరుగంటికి దగ్గర గానే  ఉన్న రాజ్యం కదా మరి. అందుచేత కుట్రలో ఆయన హస్తం కూడా ఉండి ఉండవచ్చు.      

విషయం తెలియగానే రాజ్య విస్తరణ లో భాగంగా విడి విడి ప్రదేశాలలో  యుద్ధాలు చేస్తున్న సింగమనాయకుని తనయులు అయిన అనపోతానాయకుడు, మాదానాయకుడు  క్రోధంతో ఊగిపోయారు. వారు వెంటనే వచ్చి జల్లిపల్లి దుర్గాన్ని ముట్టడించి సోమవంశ క్షత్రియులను యుద్ధంలో ఓడించి దుర్గంలో దొరికిన  క్షత్రియులను అందరిని వారి కుటుంబ సహితంగా సంహరించారు.

జల్లిపల్లి యుద్ధం తరువాత అనపోతా, మాదానాయకులు రణం కుడిపారు. రణం కుడపడం అనేది యుద్ధ అనంతరం జరిపే పద్మనాయక పధ్ధతి. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే ఆచారం అది. దానిలో అర్ధరాత్రి సమయంలో సంహరించిన శత్రువుల పుర్రెల లో అన్నం వారి రక్తంతో కలిపి, నగ్నంగా శరీరానికి విభూది మట్టి రాసుకుని దానిని డాకినీ శాకినీ పిశాచాలకు తర్పణం ఇయ్యటం.     

తదుపరి వారు దుర్గం లోనుండి తప్పించుకున్న క్షత్రియులను వెంబడించి పోయారు. దానిలో భాగంగా వారు కృష్ణా నది ని దాటి దానికి దక్షిణాన ఉన్న కర్నూలు గుంటూరు ప్రాంతాన్ని అంతటిని జయించారు. అంత   చేసినా  కూడా వారి క్రోధం శాంతించక ప్రాంత క్షత్రియ రాజులను అందరిని వారి పరివార సమేతంగా సంహరించారు. తరువాత అనపోతానాయకుడు "సోమకుల పరశురామ" అనే బిరుదం వహించాడు.

వారు జయించిన ప్రాంతం పడమర  శ్రీశైలం నుండి అప్పటికి అద్దంకి వేమా రెడ్డి మరణించగా ఆయన పుత్రుడు ఐన అనపోతా రెడ్డి రాజ్యం లోనిది. దానిని అనపోతా మాదానాయకులు  రాచకొండ రాజ్యంలో కలుపుకున్నారు.

తరువాతి కాలంలో అనపోతానాయకుని పుత్రుడు ఐన సింగభూపాలుడు రచించిన "రసవర్ణ  సుధాకరము"  అనే గ్రంధంలో ఆయన తన తండ్రి ఐన అనపోతానాయకుడు శ్రీపర్వతానికి (అంటే శ్రీశైలం) మెట్లు కట్టించాడు అని రాసాడు. 

తదుపరి మాదానాయకుడు తన చిన్నాన్న పుత్రుడు ఐన నాగానాయకునితో కలసి అక్కడికి తూర్పున ఉన్న కొండవీటి రెడ్డి రాజు అయిన అనపోతా రెడ్డి సామ్రాజ్యంలో ప్రవేశించి ఆయనను ధరణికోట దగ్గర యుద్ధంలో ఓడించాడు. యుద్ధంలో పరాజితుడు అయ్యి అనపోతారెడ్డి  తిరోగమించగా ఆయన చివరికి నాగానాయకుని చేతికి  చిక్కాడు. నాగానాయకుడు, పరాజయానికి చిహ్నంగా అనపోతారెడ్డి వీపు మీద అనపోతానాయకుని రాజలాంఛనం ముద్రించి అతనిని విడుదల చేసాడు.

కానీ రాజలాంఛన ముద్రణ నిజంగా జరిగినదా లేదా అని చరిత్రకారులకు అనుమానం. ఎందుచేతనంటే అప్పటి రాచకొండ పాలకులు అరివీరభయంకరులు. యుద్ధంలో మట్టుపెట్టకుండా శత్రువులు ఎవరినీ ఆలా వదిలెయ్యలేదు. యుద్ధంలో దయ అనేది ఎరుగరు. అలాంటిది అనపోతారెడ్డి ని యుద్ధంలో బందీగా పట్టుబడిన తరువాత కేవలం లాంఛనం  ముద్రించి ఎలా వదిలిపెట్టారు అని వారి సందేహం. 

కానీ ధరణికోట యుద్ధం గెలిచినా తరువాత కూడా అది రాచోకొండ పాలకుల అధికారంలోనికి రాలేదు. రెడ్ల మీద విజయం తరువాత రెడ్ల బిరుదులు ఐన "జగదొబ్బగండ" " సంగ్రామ ధనంజయ", "రాయవేశ్యాభుజంగ" మరియు ఇతరములు రాచకొండ దొరలు ధరించారు.  

కానీ రెడ్డి సామ్రాజ్యంలో శ్రీశైల ప్రాంతం లో పెద్ద భాగాన్ని రాచకొండ వశం చేసుకుంది. కానీ భూభాగం అనపోతానాయకుని తరువాత సింగభూపాలుని పాలనలో 1397 సంవత్సరంలో విజయనగర రాజ్యం చే జయించబడింది.

రెడ్లతో రాచకొండ రాజులకు కొనసాగిన వైరం రెడ్డి రాజ్యం అంతరించేవరకు సాగింది. ముందుగా కొండవీటి రెడ్డి రాజ్యం 1402  సంవత్సరంలో (77  సంవత్సరాలు ) అంతం అయ్యింది. తదుపరి రాజమండ్రి రెడ్డి రాజ్యం 1448  సంవత్సరంలో (53  సంవత్సరాలు )  అంతం అయ్యింది. రాచకొండ రాజ్యంతో పోరాడి బలహీనపడిన రెడ్డి రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యం జయించింది.

రాజమండ్రి రెడ్డి రాజులలో ఒకరు విజయనగర హరిహరరాయలు II పుత్రికను వివాహం చేసుకున్నారు. అంటే రెడ్లు విజయనగర రాజుల బంధువులు. మరి ఐనా సరే వారు రెడ్డి రాజ్యం ఎందుకు ఆక్రమించారో తరువాత చదివి తెలుసుకోవలసి ఉంది.                                                              

No comments:

Post a Comment