అనపోతానాయకుని పుత్రుడైన సింగమనాయకుడు II , మరియు మాదానాయకుని పుత్రుడైన వేదగిరినాయకుడు I ఇరువురు కూడా వారి తండ్రుల వలె కొండవీటి రెడ్లతో వైరం కొనసాగించారు.
ఇక్కడ తెలుగు చోడుడు అయిన భక్తిరాజు గురించి వివరంగా చెప్పాలి. ఈ భక్తిరాజు గురించి ఇంతగా చెప్పటానికి కారణం ఆయన పుత్రుడు అయిన అన్నదేవ చోడుడు రాచకొండ రాజ్యంలో శరణు కోరడం వలన తరువాత పద్మనాయకులకు రెడ్లకు యుద్ధాలు జరిగాయి. అందుచేత ఈయన గురించి ఇక్కడ విస్తారంగా చెప్పాల్సి వస్తుంది.
అనపోతారెడ్డి రాజ్య మధ్యకాలం తరువాత తెలుగు చోడుడు అయిన ఏరువ వంశానికి చెందిన భక్తిరాజు ముందుగా అనపోతారెడ్డి సామంతుడు అయినప్పటికీ తరువాత అయన మీద తిరుగుబాటు చేసాడు. భక్తిరాజు రెడ్డి రాజుల సామంతుడిగా ఉండగా ఒకసారి బహమనీ సుల్తాను అధికారులను ఓడించాడు. ఆయన రెడ్డి రాజులు గజపతుల మీద యుద్ధానికి పోయినపుడు వారితో కలసి పోయి గజపతులను ఓడించి, అప్పటికే గజపతుల ఆక్రమించుకున్న కొప్పుల నాయకుల కోరుకొండ ప్రాంత భూభాగాన్ని వారికి తిరిగి ఇచ్చాడు.
తదుపరి భక్తిరాజు గోదావరి ప్రాంతంలో స్థిరపడి అక్కడ రెడ్డి సామంతుడిగా ఒక చిన్న రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. బహమనీ సుల్తానులు రెడ్డి రాజ్యం మీద దాడి చేసినపుడు అందులో కలిగిన అవ్యవస్థ ను చూచి భక్తిరాజు అనపోతా రెడ్డి రాజ్యం మీద తిరుగుబాటు చేసాడు. అప్పుడు తిరుగుబాటును అణచడానికి వచ్చిన రెడ్డి సైన్యాన్ని అయన సురవరం ( బహుశ ఇప్పటి నూజివీడు దగ్గర ) దగ్గర ఓడించాడు. అక్కడ ఆయన కామపురి అనే నగరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడినుండి పాలించాడు. 1356 సంవత్సరానికి గోదావరి delta lo బహమనీ సుల్తానుల ఆక్రమణ వలన రెడ్డి రాజ్యం అంతరించింది. 1373 సంవత్సరంలో అనవేమా రెడ్డి తిరిగి జయించిన తరువాత అది మరల రెడ్డి రాజ్యం లోనికి వచ్చింది. ఈ మధ్య కాలంలో భక్తిరాజు తన రాజ్యాన్ని బలపరిచాడు. అనవేమా రెడ్డి గోదావరి డెల్టా ప్రాంతానికి సైన్యాన్ని మోహరించి 1377 సంవత్సరానికి ముందు కాలంలో దాన్ని జయించాడు. ఆయన అక్కడితో ఆగకుండా సింహాచలం వరకు ఉన్న ప్రదేశాన్ని జయించాడు. అనపోతారెడ్డి మంత్రి అయిన చెన్నమ నాయుని శాసనం 1375 సంవత్సరంలో వేయించబడింది సింహాచలంలో ఉంది. ఈ ప్రాంతాల మీద అనపోతారెడ్డి కి 1381 సంవత్సరం వరకు పట్టు ఉందని ఆయన ద్రాక్షారామ శాసనం తెలుపుతుంది.
అనవేమా రెడ్డి తన పుత్రిక ను భక్తిరాజు పుత్రుడైన భీమలింగని కి (అనబడే చోడ భీమునికి ) ఇచ్చి వివాహం చేసాడు. వారికి పుట్టిన పుత్రిక పేరు వేమాంబ. చోడ భక్తిరాజుకు అన్నదేవ చోడుడు అనబడే ఇంకొక పుత్రుడు కూడా ఉండెను. ఈయన ఎదుగుదలకు ఇచ్ఛ గల ఒక శక్తివంతమైన రాకుమారుడు. తన తండ్రి మరణం తరువాత సింహాసనాన్ని అలంకరించాలి అని కోరిక ఉన్నవాడు. భక్తిరాజు మృతి అనంతరం జరిగిన అతర్యుద్ధంలో అన్నదేవ చోడుడు గెలిచి సింహాసనం అధిష్టించెను. అన్నదెవ చోడుడి రాజ్య వైశాల్యం అయన రాజమహేంద్రవరం శాసనం నుండి తెలుస్తుంది. అందులో ముఖ్య ప్రాంతాలు భీమవరం, వేంగినాడు అనగా ఏలూరు పరిసర ప్రాంతం. ఇవి కాక రాజమహేంద్రవరం, కోరుకొండ ప్రాంతాలు కూడా ఈ రాజ్యంలోనివే. ఈయన వలన రెడ్డి రాజుల సీమ కృష్ణా నదికి పడమటి ప్రాంతానికి పరిమితం అయినది.
ఆయన అన్న, అనవేమారెడ్డి అల్లుడు అయిన చోడ భీముడు అప్పుడు అనవేమారెడ్డి శరణు కోరగా అనవేముడు అది సాకుగా తీసుకుని కృష్ణా నదికి తూర్పు ప్రాంతానికి వచ్చి అన్నదేవ చోడుడిని ఓడించి ఆయన పాలించిన ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ దండయాత్రలో రాజమహేంద్రవరానికి చెందిన దొడ్డా రెడ్డి ఆయన కుటుంబం అనవేమునికి సాయం చేసారు. దొడ్డా రెడ్డి దువ్వూరి కుటుంబానికి చెందిన పెరుమాండీ రెడ్డి 5 గురు పుత్రులలో ఒకడు. తరువాత దొడ్డారెడ్డి పుత్రులలో ఒకడైన అల్లాడ రెడ్డి చోడ భీముని పుత్రికను వివాహం చేసుకున్నాడు. అప్పటికి కోరుకొండ రాజధానిగా దాని పరిసరాలతో సహా రాజమహేంద్రవరం వరకు మంచికొండ ముమ్మిడి నాయకుడు ఏలుతున్నాడు. ఈ యుద్ధంలో అనవేమా రెడ్డి అన్నదేవ చోడుని సామంతులైన మంచికొండ నాయకులను కూడా ఓడించాడు. కొప్పుల నాయకులు ఒకప్పుడు పిఠాపురం పరిసర ప్రాంతాన్ని పాలించారు కానీ తరువాత మంచికొండ నాయకులచే ఓడించబడి తుని ప్రాంతానికి మారిపోయారు. అనవేముడు తన దండయాత్రలో వారిని కూడా ఓడించాడు.
అనవేముడు ఈ తూర్పు దండయాత్రలో అంతటితో ఆగకుండా ముందుకు సాగి కళింగ ప్రాంతాన్ని సింహాచలం వరకు కూడా జయించాడు. అనవేమా రెడ్డి ఈ రాజ్య విస్తరణ చేస్తుండగా రెండవ పక్కనుండి విజయనగర రాజ్యం బుక్కరాయలు I నాయకత్వంలో ముందుకు చొచ్చుకుని వచ్చి నర్సరావుపేట వరకు విస్తరించింది. రెండవ వైపు రాచకొండ అనపోతా మాదానాయకులు ముందుకు చొచ్చుకునిపోయి ఓరుగంటిని జయించి మొత్తం తెలంగాణా ప్రాంతాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు.
వెలుగోటివారి వంశావళి ప్రకారం అనవేమారెడ్డి మాదా అనబడే సింగభూపాలుడి (సింగమనాయక II ) పుత్రుని ముట్టడించి, ఓడి పారిపోయాడు. కాని ఈ యుద్ధం ఎక్కడ జరిగిందో వెలుగోటివారి వంశావళి లో లేదు. ఆ తరువాత వెలుగోటివారి వంశచరిత్ర, రావువారి వంశ చరిత్ర రెండూ కూడా సింగభూపాలుడి ఇంకొక పుత్రుడైన అన్న (అనపోతా II ) అనవేమారెడ్డి ని యుద్ధంలో ఓడించి వధించాడు అని ఉంది. ఈ యుద్ధం కూడా ఎక్కడ జరిగిందో ప్రస్తావన లేదు. పద్మనాయకులు తమ శరణు వేడిన అన్నదేవ చోడుని కి ఆయన రాజ్యం తిరిగి ఇప్పించలేకపోయారు కాబట్టి వారు అనవేమారెడ్డి ని గెలిచినా కూడా అది పూర్తి విజయం కాదు అని తెలుస్తుంది. పైగా పద్మనాయకులు అనవేమారెడ్డి భూభాగం లో ఏమీ ఆక్రమించలేకపోయారు. అది ఒక పూర్తి విజయం అయితే ఆలా జరుగును కాదు. అందుచేత ఈ పద్మనాయక- రెడ్డి యుద్ధ విశేషాలు మనకు తెలియవు.
దీనికి ఒక చరిత్రకారుడు రెడ్ల పక్షం వహించి ఒక వక్ర భాష్యం చెప్పాడు. నల్గొండ లోని వాజిరాబాద్ లో ఒక కడియం పోతినాయకుడి శాసనం ఉంది. ఆయన అనవేమా రెడ్డి సోదరుడు అయిన అన మాచ రెడ్డి భృత్త్యుడు. అందుచేత అనపోతా మాదానాయకులు అనవేమారెడ్డి చేత ఓడించబడి రాచకొండ లోని కొంత భూభాగం కోల్పోయారు అని ఆయన కధనం. కానీ విషయం ఏమిటంటే ఆ వాజిరాబాద్ కృష్ణా నది దాటగానే దాని ఒడ్డున నల్గొండ జిల్లాలో ఉంది. అంటే అనవేమారెడ్డి రాచకొండ రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నించి ఆ ప్రాంతంలో విడిది చేసి ఉండగా ఆయన భృత్యుడు ఆ శాసనం వేయించి ఉండవచ్చు కదా. రాసి ఉన్న దానిని కాదు అని చెప్పి లేని దానిని ఆపాదించడం సమంజసం కాదు.
ఈ రాసిన ఆయన ఏమి చిన్నవాడు కాదు. పెద్ద చరిత్రకారుడు. కానీ ఆయన చెప్పినట్టుగా నిజంగా అనవేమారెడ్డి అనపోతా మాదా నాయకులను ఓడిస్తే మరి ఆలా ఓడించారు అని రెడ్ల చరిత్రలో ఎందుకు రాయబడలేదు? అనపోతా మాదా నాయకులు గెలిచారు అని రాసి ఉన్నది తప్పు కానీ రాయనిది సరి అయినదా? కనీసం చరిత్రకారులు ఇలాంటి వివక్షత తో కూడిన రాతలు రాయకూడదు.
దానికి మళ్ళీ ఇంకో శాసనం సాయంగా చూపాడు ఆ చరిత్రకారుడు. అది ఏమిటంటే దేసట్ల గోత్రుడైన అన్నమనాయకుడు నల్గొండ లోని బూరుగుగడ్డ వద్ద ఒక శాసనం వేయించాడు. ఈ బూరుగుగడ్డ కూడా కృష్ణా నది దాటి నల్గొండ లో ప్రవేశించగానే ఉన్న ప్రదేశం. ఆ శాసనంలో ఆయన ఎవరి భృత్యుడో చెప్పబడలేదు. ఆయన పద్మనాయక భృత్యుడే అయ్యి ఉండవచ్చు కదా. ఈ చరిత్రకారుడి తర్కం శ్రీశైలం (అనవేముని చేత శ్రీశైలం విజయనగర సామ్రాజ్యం నుండి జయించబడి కాబట్టి )మరియు వాడపల్లి శాసనాలలో పింగళ నామ సంవత్సరం వాడబడింది. అవి రెడ్డి సామ్రాజ్యంలో ఉన్నాయి కాబట్టి అదే పింగళ నామ సంవత్సరం ఈ శాసనంలోనూ వాడబడింది కాబట్టి ఈయన కూడా రెడ్లకు భృత్యుడే అని ఆ చరిత్రకారుడు చెప్పాడు. ఇంత చెత్త తర్కం నేను ఎక్కడా చూడలేదు.
దాని తరువాత ఆయన అనపోతా మాదా నాయకుల చేతిలో పరాజయం పొంది ఉండవచ్చు కదా. ఆలా పరాజయం పొందాడు అని వెలుగోటివారి వంశావళి లో రాసి ఉంది కూడా. అందుచేత ఇది నిజం కాని ఏదో కుంటి తర్కంతో రాసి ఉన్నదానికి సరిగా విరుద్ధం ఐనది నిజం అని చెప్పడం, అది కూడా సరి అయిన రుజువులు లేకుండా, అంతటి పండితునికి అస్సలు తగదు.
No comments:
Post a Comment