Sunday, 20 December 2020

పద్మనాయక మరియు రెడ్ల మధ్య వైరం కుమారగిరి రెడ్డి రాజ్య కాలం 1386 సంవత్సరం నుండి 1402 సంవత్సరం వరకు.

 కుమారగిరి రెడ్డి అనపోతా రెడ్డి పుత్రుడు కానీ అనపోతా రెడ్డి  మరణించే సమయానికి కుమారగిరి రెడ్డి చిన్నవాడు కావటం చేత రాజ్యాధికారం ఆయన చిన్న తమ్ముడైన అనవేమారెడ్డి చేపట్టాడు. అనవేముడి పాలన అనంతరం కుమారగిరి రెడ్డి రాజ్యాధికారానికి వచ్చాడు. కానీ ఇది సాఫీగా జరగలేదు. ఆయనను కొంత మంది ఎదిరించగా వారిని ఓడించి రాజ్యానికి వచ్చాడు కుమారగిరి. కానీ ఆయనను ఎదిరించినవారు ఎవరో చరిత్రలో ఎక్కడా రాయబడలేదు.

కుమారగిరి రెడ్డి తన బావ అయిన కాటయవేమా రెడ్డి ని అన్ని విషయాలకు సలహాదారుగా చూసాడు. కాటయవేమా రెడ్డి తండ్రి పేరు కాటయ రెడ్డి. ఆయన కుమారగిరి రెడ్డి మేనత్తను వివాహం చేసుకున్నాడు. తిరిగి కాటయ వేమా రెడ్డి కుమారగిరి రెడ్డి సోదరిని వివాహం చేసుకున్నాడు (మేనరికం).

ప్రోలయ వేమారెడ్డి అద్దంకి రెడ్డి రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయన అన్న అయిన  మాచ రెడ్డి ని రెడ్డి తన రాజ్యంలోని చందవోలు కు, తమ్ముడైన మల్లా రెడ్డి ని కందుకూరు కు రాజులను చేసాడు. మాచ రెడ్డి కొడుకు పెదకోమటి వేమా రెడ్డి. కుమారగిరి రెడ్డి, కాటయవేమారెడ్డి ని  ముఖ్య సలహాదారుగా చేసుకోవడం పెదకోమటి వేమారెడ్డి కి రుచించలేదు.

కాటయవేమా రెడ్డి ని సలహాదారుగానే కాకుండా దాదాపుగా మంత్రిగా చూడటం రెడ్ల పద్ధతికి విరుద్ధం ఎందుకంటే మంత్రులుగా వారు బ్రాహ్మణ వ్యక్తులనే నియమించేవారు. కుమారగిరి రెడ్డి  పద్ధతిని కొంతమంది సామంతులు సమర్ధించగా కొంతమంది వ్యతిరేకించడం వలన రాజ్యంలో అంతర్యుద్ధం వచ్చింది. కొంతమంది అప్పుడు కుమారగిరిని సమర్ధించగా కొంతమంది పెదకోమటివేముడిని సమర్ధించారు. చివరికి వారి ఇరువురి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది కానీ దాని పూర్తి వివరాలు మనకు తెలియవు కానీ దాని ప్రకారం కుమారగిరికి సంతతి లేకపోతె పెదకోమటి రాజు అవుతాడు అన్నది ఒక ఒడంబడిక అంతర్యుద్ధం 1386  సంవత్సరంలో జరిగింది.

రెడ్డి రాజ్యంలో అంతర్యుద్ధాన్ని అదనుగా చేసుకొని విజయనగర రాజు అయిన హరిహర రాయలు II దాని మీద దండెత్తి ముందుగా త్రిపురాంతకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత గుంటూరు జిల్లాలోని వినుకొండ వరకు విజయనగర సైన్యాలు పురోగమించాయి. దాడిలోనే విజయనగరం తాను ముందుగా అనవేమారెడ్డి కి కోల్పోయిన స్రిశైలం ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకొంది

తన రాజ్యంలో అంతర్యుద్ధం ముగియగానే కుమారగిరి విజయనగరం స్వాధీనం చేసుకున్న తమ భూభాగాన్ని తిరిగి విజయనగరం నుండి జయించడానికి కాటయవేముని పెద్ద సైన్యంతో పంపాడు. దండయాత్రలో భాగంగా విజయనగర సైన్యాలు అప్పటికే కొత్తకొండ వద్ద రాచకొండ మరియు బహమనీ సైన్యాలతో పెద్ద పరాజయం చెంది బలహీనపడి ఉన్నాయి. హరిహరరాయలు బహమనీ సుల్తానులతో మరియు పద్మనాయకులతో పోరాడడానికి పక్కన ఉన్న రెడ్డి రాజ్యంతో స్నేహం ముఖ్యం అని భావించి వారితో సంధి చేసుకున్నాడు. హరిహరరాయలు త్రిపురాంతకం, వినుకొండ రెడ్డి రాజ్యానికి తిరిగి ఇవ్వగా రెడ్డి రాజులూ శ్రీశైల ప్రాంతాన్ని విజయనగరానికి వదిలివేశారు. సంధిలో భాగంగా హరిహరరాయలు II  తన పుత్రిక హరిహరాంబ ను కాటయ వేమా రెడ్డి కి ఇచ్చి వివాహం చేసాడు.

రెడ్డి రాజుల లాగే రేచెర్ల ప్రభువులు కూడా వారి ప్రదేశాన్ని విస్తరించడానికి యుద్ధాలు చేసారు. వెలుగోటివారి వంశావళి ప్రకారం సింగభూపాలుడి పుత్రుడు అయిన మాదానాయక II కుమారగిరి రెడ్డి ని యుద్ధంలో ఓడించాడు. బహుశా ఇది అనపోతనాయకయొక్క కళింగ దండయాత్రలో జరిగి ఉండవచ్చును. అది 1381  సంవత్సరం లో అనపోతనాయకవేసిన సింహాచల శాసనం ముందు జరిగింది. యుద్ధంలో పెదవేదగిరి నాయకుడు, మాదానాయక II  పాల్గొన్నారు. వెలుగోటివారి వంశావళి ప్రకారం యుద్ధంలో  పెదవేదగిరినాయకుడు  తుని దగ్గర ఉన్న బెండపూడి దుర్గాన్ని జయించాడు. కానీ రెడ్డి రాజ్యం మీద ఇది ఒక పూర్తి విజయం కాకపోవచ్చును ఎందుకంటే రెడ్డి రాజ్యం పూర్తిగా పద్మనాయకుల చేతుల్లోనికి రాలేదు.      

ఏది ఏమైనా 1390  సంవత్సరానికి కుమారగిరి, కొండవీటి రెడ్డి రాజ్యాన్ని శాంతితో ఏలుతున్నాడు. అప్పటికి ఆయన తన శత్రువులను ఓడించడమో లేదా వారితో సంధి చేసుకోవడమో చేసాడు. కుమారగిరి పనుపున కాటయవేముడు కళింగ దండయాత్ర చేసాడు. బహుశా ఇది కాటయవేముని 1388  సంవత్సరంలోని సర్పవరం శాసనం సమయంలో జరిగింది. కుమారగిరి కాటయవేమునికి "కటకచూరకర " అనే బిరుదం ఇచ్చాడు అంటే  ఆయన తన కళింగ దండయాత్రలో కళింగలో Cuttack  వరకు చొచ్చుకుని  పోయాడు. ఈ కళింగ  యుద్ధంలో కాటయవేముడు జయించిన గజపతి రాజు గంగ వంశానికి చెందిన నరసింహదేవ IV .  కాటయవేమునితో పాటు దండయాత్రలో అల్లాడరెడ్డి పుత్రులైన వేమారెడ్డి మరియు దొడ్డారెడ్డి కూడా పాల్గొన్నారు. రెడ్డి రాజులు అందరిలోనూ కాటయవేమా రెడ్డి మహావీరుడు

కాటయవేముని దండయాత్ర వలన సింహాచలం వరకు ఉన్న కళింగ రాజ్యం రెడ్డి రాజ్యంచే జయించబడి దానిలో భాగం అయ్యింది. అది రాజమహేంద్రవర రాజ్యం అని పిలువబడింది. కుమారగిరి రెడ్డి తన పుత్రుడైన అనపోతా రెడ్డి II  ను రాజమహేంద్రవర రాజ్యానికి రాజును చేసాడు. అనపోతారెడ్డి II  రాజమహేంద్రవర  రాజ్యాన్ని అల్లాడ రెడ్డి సమర్దనతో పాలించాడు. కాటయవేముడు తన పుత్రిక అయిన అనితల్లి ని అల్లాడ రెడ్డి చిన్న కుమారుడైన వీరభద్రారెడ్డి కి ఇచ్చి వివాహం చేసాడు.

No comments:

Post a Comment

NEW INTERSTELLAR OBJECT-ATLAS/31

A new Comet known as 31/ATLAS ( Asteroid Terrestrial Impact Last Alert System) is approaching the solar system.....this was spotted by Astro...