Sunday, 20 December 2020

పద్మనాయక మరియు రెడ్ల మధ్య వైరం పెదకోమటి వేమారెడ్డి.రాజ్యకాలం 1402 సంవత్సరం నుండి 1420 సంవత్సరం వరకు.

 పెదకోమటి వేమారెడ్డి, కుమారగిరి రెడ్డి పెదనాన్న అయిన మాచా రెడ్డి  రెడ్డి పుత్రుడు. కుమారగిరి రెడ్డి చివరి సమయంలో రెడ్డి రాజ్యం నలువైపులా ముట్టడించబడి కల్లోలం గా ఉండటం చూసి పెదకోమటి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పద్మనాయకులు అయిన వెలుగోటి రాయప నాయక, గజరావు తిప్పనాయక ఇద్దరు కూడా అంతర్యుద్ధం లో పెదకోమటివేమ రెడ్డి తరఫున పోరాడి ఆయన సింహాసనానికి రావటానికి చాలా సాయపడ్డారు. ఇందులో వెలుగోటి రాయపనాయకుడు రెడ్డి రాజ్యానికి సామంతుడిగా ఉంటూ గుంటూరు చుట్టు పక్కల ప్రదేశాలను పాలించాడు, ఈయన సామంతుడు గజరావు తిప్పన. 

గజరావు తిప్పన పెదకోమటివేమారెడ్డి తరఫున పోరాడుతూ కుమారగిరి రెడ్డి విధేయుడు, బావ అయిన కాటయవేమారెడ్డి ని ఏలూరు దగ్గర ఉన్న గుండుగొలను దగ్గర ఓడించాడు. కుమారగిరి  రెడ్డి కి తనయుడు లేకపోవటం వలన ఆయన తరువాత కాటయవేమా రెడ్డి రాజ్యానికి వచ్చేవాడు. కానీ మరి కాటయవేమా రెడ్డి హరిహర రాయలు II  అల్లుడు. అందుచేత హరిహరరాయలు విజయనగర సైన్యాలను పెదకోమటివేమా రెడ్డి మీదికి నడిపాడు. విజయనగర సైన్యాధిపతి అయిన చావుండప అమాత్యుడు కొండవీటివరకు రెడ్డి సామ్రాజ్యంలోనికి చొచ్చుకునిపోయాడు.   అప్పుడు మరల పెదకోమటివేమారెడ్డి సైన్యాధిపతి అయిన గజరావు తిప్పన కొండవీటి పొలిమేరలలో విజయనగర సైన్యాలతో తలపడి వారిని ఓడించాడు. దాని తరువాత పెదకోమటివేమారెడ్డి కొండవీటి సింహాసనం అధిష్టించాడు.

పెదకోమటి వేమారెడ్డి తమ్ముడి పేరు కూడా మాచా రెడ్డి నే. పెదకోమటి వేమారెడ్డి ఆయనకు కృష్ణా నదికి ఉత్తరాన ఉన్న భూభాగాన్ని ఇచ్చాడు. మాచా రెడ్డి కృష్ణా జిల్లాలోని కొండపల్లి కోటను పటిష్టం చేసి రాజధానిగా చేసుకున్నాడు.  

రెడ్డి రాజ్యంలో అయిన ఈ అంతర్యుద్ధంలో కుమారగిరి ఓడిపోయి, కాటయవేమా రెడ్డి తో సహా రాజమహేంద్రవరం  చేరుకున్నాడు. పెదకోమటి రాజ్యం తీసుకున్న కొన్ని సంవత్సరాల కాలం తరువాత కుమారగిరి మరణించాడు.

పెదకోమటి వేమా రెడ్డి సింహాసనం మీద నిలదొక్కుకునే సమయానికి విజయనగం సామ్రాజ్యంలో హరిహరాయలు II  మరణించాడు (1404  సంవత్సరం) .  సింహాసనానికి ఆయన పుత్రులైన దేవరాయలు I , విరుపాక్షరాయలు II  మరియు బుక్కరాయలు II  పోటీ పడ్డారు. అంతర్యుద్ధంవలన విజయనగర రాజ్యం కల్లోలం అయ్యింది. అది అదనుగా చూసుకుని పెదకోమటి వేమా రెడ్డి సైన్యాలు ఇదివరకు కొండవీటి నుండి ఆక్రమించిన ప్రాంతంలో ఉన్న విజయనగర సైన్యాన్ని ఓడించి ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

కుమారిఁగిరి రెడ్డి మరణించినా కూడా పెదకోమటివేమా రెడ్డి మరియు కాటయవేమా రెడ్డి మధ్య సంబంధాలు చెడిపోయాయి. కాటయవేమారెడ్డి, పెదకోమటివేమా రెడ్డి అధికారాన్ని ధిక్కరించి రాజమహేంద్రవరాన్ని స్వతంత్రంగా పాలించడం మొదలుపెట్టాడు. పైగా ఇప్పుడు విజయనగర రాజులూ ఆయన బావమరుదులు కదా. ఇక అప్పటినుండి కొండవీడు, రాజమహేంద్రవరం రాజ్యాలు వైరం కొనసాగించాయి. ఈ రెడ్డి రాజ్యాల మధ్య వైరం కొండవీటి సామ్రాజ్యాన్ని బలహీనం చేసింది. అలాగే రాజమహేంద్రవరం రాజ్యం కూడా బలహీనపడింది.

ఈ రాజమహేంద్రవర రాజ్య బలహీనత ను సొమ్ము చేసుకున్నవాడు మనం ఇదివరకు చెప్పుకున్న అన్నదేవ చోడుడు. ఇంతకు ముందు ఈయనకు దేవరకొండ రాజ్యం లో పెదవేదగిరి నాయకుడు ఆశ్రయం ఇచ్చాడు. ఈయన ఒకప్పుడు పాలించిన సామంత రాజ్యం రాజమహేంద్రవర రెడ్డి రాజ్యంలో భాగమే. అన్నదెవ చోడుడు దేవరకొండ సాయంతో తాను కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి తీసుకోవడానికి పోరాడాడు. బహుశా దానిలో పెదకోమటి వేమా రెడ్డి కూడా అతనికి సాయపడ్డాడు.  

1408  సంవత్సరంలో తన పోలవరం శాసనం ప్రకారం అన్నదేవ చోడుడు తన రాజ్యాన్ని స్వతంత్రంగా ఏలుతున్నాడు. అంటే అప్పటికే ఆయన రాజమహేంద్రవర రెడ్డి రాజ్యాన్ని చీల్చాడు.

అప్పుడు రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం, ఒకవైపు కొండవీడు, రెండవ వైపు అన్నదేవ చోడుని రాజ్యం పక్కన ఉండి ప్రమాదంలో పడింది. కాటయవేమా రెడ్డి అది చూసి విజయనగర రాజ్యానికి వెళ్లి అప్పటికి అంతర్యుద్ధంలో గెలిచి రాజు అయిన దేవరాయ I  ను కలిసాడు. అయన కాటయవేమునికి బావమరిది కదా మరి.

దేవరాయ I , తన సైన్యాన్ని తీసుకుని 1412  సంవత్సరంలో కొండవీడు రాజ్యాన్ని ముట్టడించాడు. ఆయన కొండవీటి రాజ్యంలోకి వచ్చి బాపట్ల దగ్గర ఉన్న మోటుపల్లి రేవును జయించాడు కానీ తరువాత పెదకోమటివేమారెడ్డి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అందుచేత దేవరాయ I  కు దండయాత్రలో ఒరిగింది ఏమి లేదు. కాకపోతే రాజమహేంద్రవర రాజ్యానికి ఒత్తిడి తగ్గింది అంతే.

తరువాత కాలంలో పెదకోమటివేముడు తిరిగి రాజమహేంద్రవర రాజ్యాన్ని ముట్టడించాడు. ముట్టడిలో గజరావు తిప్పన చేతిలో కాటయవేమా రెడ్డి మరణించాడు. ఎందుకంటే గజరావు తిప్పనికి " కాటయ వేముని తలగొండ గండ అనే బిరుదం లభించింది. 1414  సంవత్సరం తరువాత కాటయవేమా రెడ్డి శాసనాలు కనిపించడం లేదు ఆంటే అప్పటికి ఆయన మరణించి ఉండాలి.

కాటయ వేమారెడ్డి మరణం తరువాత కుమారగిరి రెడ్డి II  రాజమహేంద్రవర సింహాసనం అధిష్టించాడు. ఈయన మరణం తరువాతనే అన్నదేవ చోడుడు పెదకోమటి వేమారెడ్డి సాయంతో రాజమహేంద్రవర రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కానీ అన్నదేవ చోడుడు రాజమహేంద్రవర రాజ్యాన్ని ఎక్కువ కాలం పాటు పాలించలేకపోయాడు. ఆయనను తరువాత అల్లాడ రెడ్డి ఓడించి కాటయవేమా రెడ్డి పుత్రిక ఐన అనితల్లి ని రాణిగా చేసి ఆమె తరఫున తాను రాజ్యాన్ని పాలించాడు. అన్నదేవ చోడుడు అల్లాడ రెడ్డి చేతిలో మరణించాడు.

కానీ అప్పటికి కూడా పెదకోమటి వేమా రెడ్డి కన్ను రాజమహేంద్రవర రాజ్యం మీద నుండి పోలేదు. తరువాత అయన బహమనీ సుల్తానులతో ఒప్పందం చేసుకుని వారి సాయంతో రాజమహేంద్రవరం రాజ్యాన్ని ముట్టడించాడు. బహమనీ సుల్తానులు పెదకోమటివేమ రెడ్డి తో ఒడంబడికి చేసుకొనడం  రాచకొండ పద్మనాయకులకు నచ్చకపోయినా వారు ఏమీ చేయలేకపోయారు. బహమనీ, కొండవీడు మధ్య ఒప్పందం గురించి వెలుగోటివారి వంశావళి లో కూడా చెప్పబడింది. బహమనీ సుల్తాన్, పెదకోమటి వేమా రెడ్డి సైన్యాలను అల్లాడ రెడ్డి సమర్ధవంతంగా ఎదుర్కొని ఓడించాడు.

పెదకోమటి వేముడి మరియు బహమనీ సుల్తానుల సైన్యాలు అల్లాడ రెడ్డి తో యుద్ధం చేస్తున్న సమయంలో విజయనగర రాజు ఐన దేవరాయ I తన సైన్యాన్ని రెండు భాగాలుగా విడతీసి ఒక భాగాన్ని బహమనీ రాజ్యం మీదకు, రెండోదాన్ని కొండవీటి మీదకు పంపాడు.  అప్పటికే అల్లాడరెడ్డి చేతిలో పరాజయం చెందిన బహమనీ సైన్యాలు విజయనగర ముట్టడి విని కంగారుపడి వెంటనే వెనక్కు వచ్చి  "పానగల్" దుర్గాన్ని స్థావరంగా చేసుకున్న విజయనగర సేనలను ముట్టడించాయి. పానగల్ దుర్గాన్ని 2 సంవత్సరాల కాలం ముట్టడించినా కూడా అది బహమనీ  సైన్యాలకు వశం కాలేదు. ఇందులో పెదకోమటై వేమా రెడ్డి కొండపల్లి రాజధానిగా పాలిస్తున్న తన తమ్ముడైన మాచా రెడ్డి ని బహమనీ సైన్యాలకు సాయంగా పంపాడు.

అప్పుడు దేవరాయ I  రాచకొండ రాజ్యంతో మంతనాలు చేసి వారిని తన వైపు తిప్పుకున్నాడు. వారికీ ముందే బహమనీ కొండవీటి రాజ్యంతో ఒప్పందం చేసుకోవడం ఇష్టం లేకపోవటం వలన పని సులభం అయ్యింది. యుద్ధం జరుగుతుండగా అప్పటికి బహమనీ సామంతులు ఐన రేచెర్ల రాజ్య సైన్యం యుద్ధంనుండి వెనక్కు వచ్చి విజయనగర సైన్యాలతో కలిసింది. దానివలన బహమనీ సైన్యాలు ఘోరంగా ఓడిపోయాయి.

పెదకోమటి వేమారెడ్డి తన చివరి రోజులు రాచకొండ, దేవరకొండ రాజ్యాలతో యుద్ధం చేస్తూ గడిపాడు. పెదకోమటివేమారెడ్డి, మాచా రెడ్డి ఒక వైపు, దేవరకొండ నుండి కుమారమాదా నాయకుని పుత్రులైన  కుమారవేదగిరి నాయక మరియు లింగమనాయక ఒక వైపు.  

మాచా రెడ్డి ని కుమారవేదగిరి సంహరించి అయన రూపంతో ఉమ్మి వేసే పాత్రను చేయించుకున్నాడు. పెదకోమటివేమా రెడ్డి తిరిగి కుమారవేదగిరిని ఓడించి సంహరించి అయన చేసిన పనికి ప్రతీకారంగా అయన రూపంలో ఉమ్మి వేసే పాత్రను చేయించుకున్నాడు.

అప్పటికి లింగమనాయకునికి కేవలం 12  సంవత్సరాలు మాత్రమే. ఆయన పెద్ద సైన్యాన్ని సమకూర్చుకుని పెదకోమటివేముని ముట్టడించి ఓడించి అయన రూపంతో తిరిగి ఉమ్మి వేసే పాత్ర చేయించుకున్నాడు. లింగమనెడు పెదకోమటివేమారెడ్డి సింహాలాంఛనాన్ని, “నందికంట పోతరాజు కటారి” అనే అయన ఖడ్గాన్ని దేవరకొండకు తీసుకుపోయాడు. దానితోపాటు పెదకోమటివేముడుని కూడా బందీగా తీసుకుని వెళ్ళాడు. కానీ తరువాత కాలంలో పెదకోమటివేముని వదిలిపెట్టాడు. ఆలా ఎందుకు చేసాడో దానికి కారణాలు తెలియవు. తరువాత లింగమనేడు మరియు సింగయ అన్న కలసి పెదకోమటివేమారెడ్డి ని సంహరించారు. ఇది 1420   సంవత్సరంలో జరిగింది.

కుమారగిరిరెడ్డి కొండవీటి రెడ్డి రాజ్యాన్ని రెండుగా విడతీసి అది క్షీణించడానికి కారణం అయ్యాడు. అలాగే పెదకోమటివేముడు కూడా కృష్ణా నదికి ఉత్తరంగా ఉన్న రాజ్యాన్ని మాచా రెడ్డి కి ఇచ్చి తన తరువాత కొండవీటి రాజ్యాన్ని ఇంకా క్షీణించేలా చేసాడు.

పెదకోమటివేమా రెడ్డి వీరుడే కాదు ఒక పెద్ద పండితుడు కూడా. అయన సంస్కృతంలో అనేక ప్రభందాలు రచించాడు. ఈయన ముఖ్య సైన్యాధిపతి గజారావు తిప్పన. అంటే పెదకోమటివేమారెడ్డి దేవరకొండ రాజ్యంతో యుద్ధం చేసినపుడు గజారావు తిప్పన కూడా పద్మనాయకులకు విరుద్ధంగా వారితో యుద్ధం చేసి ఉండాలి. మరి ఆయన యుద్ధాలలో మరణించాడా లేదా అనేది మనకు  తెలియదు.

No comments:

Post a Comment